బ్రుసీల్లోసిస్ అంటే ఏమిటి?
బ్రుసీల్లోసిస్కు దాని కారక జీవి అయిన బ్రుసిల్ల అని పిలవబడే ఒక రకమైన బ్యాక్టీరియా సమూహం ఆధారంగా ఆ పేరు పెట్టబడింది. ఇది ఒక అరుదైన వ్యాధి మరియు ఏ విధమైన కొత్త రకమైన సమస్యలు కలుగనంత వరకు ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు.
బ్రూసీల్లోసిస్ అనేది ఒక రకమైన అంటువ్యాధి (infection), ఇది జంతువులు మరియు మానవులను ప్రభావితం చేస్తుంది. బాక్టీరియా కలుషిత ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది లేదా బహిరంగ గాయం(open wound) ద్వారా వ్యాపించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
బ్రుసీల్లోసిస్ యొక్క లక్షణాలు ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. అవి సాధారణంగా ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
- చలి
- వొళ్ళు నొప్పులు
- తలనొప్పి మరియు తేలికపాటి జ్వరం రావచ్చు
- మందకొడిగా ఉండడం మరియు బద్ధకం
- ఆకలి తగ్గుదల మరియు బరువు కోల్పోవడం
- నడుము నొప్పి, కీళ్ళు మరియు కడుపు నొప్పి
బ్రూసెల్లోసిస్ ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్రూసెల్ల, పచ్చి మాంసం మరియు శుద్ధి చెయ్యని (unpasteurised) పాలలో అవి ఎక్కువగా కనిపిస్తాయి. సంక్రమణ యొక్క సాధారణ మార్గాలు బ్యాక్టీరియాను పీల్చడం, కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం లేదా వ్యాధి సోకిన జంతువుల యొక్క బహిరంగ గాయాన్ని తాకడం.అప్పుడప్పుడు, అది లైంగిక సంబంధాలు మరియు తల్లి పాల ద్వారా కూడా సంక్రమిస్తుంది. గడ్డిలో మరియు పొలాల్లో పనిచేసే వ్యక్తులు మరియు జంతువులతో ఎక్కువగా గడిపేవారిలో ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
చికిత్సకు తగ్గని లేదా లొంగని స్థిరమైన ఫ్లూ-లాంటి స్థితి ఉన్నపుడు బ్రుసెలోసిస్ పరీక్షను నిర్వహించవచ్చు. రోగనిర్ధారణ కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలను చూపించడానికే కొన్నిసార్లు ఒక నెల సమయం వరకు పడుతుంది. వ్యాధి నిర్ధారణలో ఈ క్రిందవి ఉంటాయి:
- రక్త పరీక్షలు
- మూత్ర పరీక్షలు
- సెరెబ్రోస్పానియల్ ద్రవం (cerebrospinal fluid) పరీక్షించడం
- బాక్టీరియాను గుర్తించడానికి ఎముక మజ్జ సాగు (Bone marrow culture)
బ్రూసెల్లోసిస్ చికిత్సకు ప్రధానమైనవి మందులు. డొక్సీసైక్లిన్ (doxycycline)మరియు రిఫాంపిన్ (rifampin) వంటి యాంటీబయాటిక్స్ కలయిక సాధారణంగా సూచించబడుతుంది. గుర్తించదగ్గ మెరుగుదల కనిపించడానికి కొన్ని వారాల సమయం పడుతుంది అయితే, ఈ వ్యాధి జీవితంలో మళ్లి పునరావృత్తమైయ్యే అవకాశాలు చాలా సాధారణం అని గుర్తుంచుకోవడం ముఖ్యం. అందువల్ల జంతువులతో గడపడాన్ని పరిమితం చేయటం చాలా ముఖ్యం, వాటి చుట్టూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి మరియు పచ్చి మాంసం మరియు శుద్ధి చేయని పాల ఉత్పత్తులను తినడం నివారించాలి.
సాధారణంగా ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా, నిరంతర సంక్రమణం ప్రమాదకరంగా ఉంటుంది మరియు దాని వలన మెదడు పొరలలో వాపు ఏర్పడుతుంది. ఇది కీళ్ళు మరియు ఎముకలలో అలాగే గుండె యొక్క గోడలు మరియు గాయాలలో వివిధ అంటువ్యాధులకు కారణం కావచ్చు.