సారాంశం
దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ( క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా సి కె డి / క్రానిక్ రెనాల్ డిసీజ్) కలిగిన రోగులలో మూత్రపిండాలు క్రమేపీ పనిచేయడం మానివేస్తాయి. అంటే వ్యాధి ముదరుతుండగా, మూత్రపిండాలకు అవి సాధారణంగా కొనసాగిస్తున్న రక్తం వడబోత అసాధ్యమవుతుంది. సి కె డి కి రెండు ముఖ్య కారణాలు మధుమేహం జబ్బు మరియు హెచ్చుస్థాయి రక్తపోటు. తొలిదశలో మూత్రపిండాలు ఎలాంటి జబ్బు లక్షణాలను చూపించవు. జబ్బు లక్షణాలు కనిపించని కారణంగా రక్తం మరియు మూత్రం సాధారణ వైద్యపరీక్ష లేదా చెకప్ జరిపించినప్పుడు జబ్బు నిర్ధారింపబడుతుంది. చికిత్స తర్వాత కూడా కిడ్నీల పనితీరు మరింత చెడినప్పుడు, లేదా తొలి దశలలో సికెడీ నిర్ధారింపబడనప్పుడు, రోగి చీలమండ వాపు, మూత్రంలో రక్తం , కండరాలలో తిమ్మిరి పెరగడం, తరచుగా మూత్రవిసర్జన జరపడం, కొద్దిపాటి శ్రమతో కూడా శ్వాసక్రియకు ఇబ్బంది ఏర్పడటం వంటి లక్షణాలను ఎదుర్కొంటాడు. దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బుకు చికిత్స దాని కారణం పై ఆధారపడి ఉంటుంది. ఔషధాలతో పాటు, జీవనసరళిలో మార్పులు కూడా సికెడి నిర్వహణలో కీలకపాత్ర వహిస్తాయి. కిడ్నీ పనితీరు రోజురోజుకు అధ్వాన్నమవుతుంటే, రోగి కిడ్నీజబ్బు చివరి దశలో ఉన్నడని ఊహించవచ్చు. దీనిని ఎండ్-స్టేజ్ రెనాల్ డిసీజ్ (ఇ ఎస్ ఆర్ డి / రెనాల్ వైఫల్యం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు), దీనికి పర్యవసానం డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి. సికెడి రోగులలో ప్రతి 50 మందిలో ఒకరికి కిడ్నీ వైఫల్యం ఎదురవుతుంటుంది. మూత్రపిండాల వైఫల్యాన్ని, ఇతర దురవస్థలను నివారించడానికై తొలిదశలో జబ్బు నిర్ధారణ ముఖ్యం.