ఎండోకార్డయిటిస్ అంటే ఏమిటి?
గుండె మూడు పొరలను కలిగి ఉంటుంది, అవే పెరికార్డియం, మయోకార్డియం, మరియు ఎండోకార్డియం. గుండెలోని మిక్కిలి అంతర పొర ఎండోకార్డియం. ఎండోకార్డియం పొర యొక్క వాపునే “గుండె లోపలిపొర వాపు” లేదా ఎండోకార్డిటిస్ అంటారు. ఎండోకార్డియం పొర సాధారణంగా సూక్ష్మక్రిమికారక (బ్యాక్టీరియల్) అంటురోగాల వల్ల వాపురోగానికి గురవుతుంది. సూక్ష్మజీవులు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి, అటుపై రక్తప్రవాహంలో చేరి చివరకు ఎండోకార్డియం పొరను బాధిస్తాయి. గుండె లోపలిపొర వాపు రుగ్మత గుండెను దెబ్బతీసి ప్రాణాంతక సమస్యలను కల్గిస్తుంది గనుక దీనికి శక్తిమంతమైన చికిత్స అవసరం.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గుండె లోపలిపొర వాపు సంక్రమణను కలుగజేసే సూక్ష్మక్రిములపై (బాక్టీరియాపై) ఆధారపడి ఈ వ్యాధి లక్షణాలు నెమ్మదిగా లేదా వేగంగా అభివృద్ధి చెందుతాయి; తదనుగుణంగా, వ్యాధి తీవ్రమైనది లేక దీర్ఘకాలికమైందిగా వర్గీకరించబడుతుంది. గుండె లోపలిపొర వాపు (ఎండోకార్డిటిస్) యొక్క లక్షణాల తీవ్రతను బట్టి మారుతూ ఉంటాయి మరియు అంతకు ముందుగానే ఉన్న వైద్యపరమైన లేదా గుండె సమస్యలపై ఆధారపడి దీని లక్షణాలు ఉంటాయి. దీని కొన్ని లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- చలి జ్వరం
- శ్వాసలో సమస్యలు (డిస్స్పనోయియా)
- శ్వాస తీసుకున్నప్పుడల్లా ఛాతీలో నొప్పి
- పాదాల వాపు
- పెటెకియా (చర్మంపై గుండుసూది పొడుచుకొచ్చినట్లు కనిపించే ఎర్రమచ్చలు)
- అలసట
- కీళ్ల నొప్పులు మరియు ఒంటి నొప్పులు
గుండె లోపలిపొర వాపు వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటి?
కొన్ని సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) శరీరం లోపలికి రక్తంతో పాటు ప్రయాణించి, హృదయానికి చేరుకుంటాయి, ఇది గుండె లోపలిపొర వాపు వ్యాధికి కారణమవుతుంది. బ్యాక్టీరియా కాకుండా, కొన్ని శిలీంధ్రాలు (బూజు) గుండె లోపలిపొర వాపు వ్యాధికి కారణమవుతాయి. ఈ బాక్టీరియా క్రిములు కింద తెలిపినవాటి ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి:
- నోటిద్వారా
- చర్మం మరియు చిగుళ్లవ్యాధుల (గమ్ ఇన్ఫెక్షన్) ద్వారా
- వేడినీళ్లలో శుభ్రపరచని సూదులు లేదా సిరంజిలు (Unsterilized needles or syringes) ఉపయోగించడంవల్ల లేదా ఒకసారి వాడి పారవేసే సిరంజీలను తిరిగి వాడటం వల్ల
- కాథెటర్స్ మరియు లాపరోస్కోప్స్ వంటి వైద్య సాధనాల వల్ల
పుట్టుకతోనే గుండె వ్యాధుల్ని కలిగినవారు, గుండె కవాట వ్యాధులు, అధిక రక్తపోటు, శోషించబడిన గుండె కవాటాలు లేదా గుండె జబ్బు యొక్క చరిత్ర ఉన్నవారు గుండె లోపలిపొర వాపు (ఎండోకార్డిటిస్) రుగ్మత ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గుండె లోపలిపొర వాపుని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
సరైన శారీరక పరీక్ష, ఖచ్చితమైన వైద్య చరిత్ర ఆధారంగా సాధారణంగా గుండె లోపలిపొర వాపు (ఎండోకార్డిటిస్ను) ను నిర్ధారించడం జరుగుతుంది. శారీరక పరీక్ష ద్వారా “ముర్ముర్” (murmur) అని పిలవబడే ఓ అసాధారణ హృదయ ధ్వనుల ఉనికిని వెల్లడిస్తుంది. ఎండోకార్డియం పొరకు వ్యాధిని కల్గించి, ఈ పొరకు కల్గిన గాయాన్ని తీవ్రతరం చేసిన బ్యాక్టీరియాను గురించిన వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకుగాను, కొన్ని పరిశోధనలు అవసరం:
- సంపూర్ణ రక్త గణన (CBC) పరీక్ష
- యాంటిబయోటిక్ సున్నితత్వం తో కూడిన రక్తసాగు పరీక్ష (Blood culture with antibiotic sensitivity)
- సి-రియాక్టివ్ ప్రోటీన్ల (CRP లు) స్థాయి పరీక్ష
- ఎకోకార్డియోగ్రామ్ (2D echo అని కూడా పిలుస్తారు)
- CT స్కాన్
గుండె లోపలిపొర వాపు వ్యాధి (ఎండోకార్డిటి)కి కింది చికిత్సా పద్ధతులు ఉన్నాయి
-
వైద్య నిర్వహణ (మెడికల్ మేనేజ్మెంట్) - విస్తృత స్థాయి సూక్ష్మక్రిమినాశక (బ్రాడ్ స్పెక్ట్రం యాంటీబయాటిక్స్) మందుల్ని లేదా రక్తసాగు పరీక్ష నివేదిక ప్రకారం అవసరమయ్యే మందుల్ని కడుపులోకి నోటిద్వారా మింగించడం ద్వారా సేవింపజేయడం (oral) లేదా నరాలకు మందులెక్కించి (ఇంట్రావెన్సివ్ గా) కూడా ఇవ్వవచ్చు. కొన్నిసార్లు, జ్వరాన్ని నియంత్రించటానికి మరియు ఒంటినొప్పుల్ని మరియు అనారోగ్యాన్ని తొలగించడానికి యాంటిపైరెటిక్స్ని ఉపయోగిస్తారు.
సర్జికల్ మేనేజ్మెంట్ - ఈ శస్త్ర చికిత్సను మిట్రల్ స్టెనోసిస్ (mitral stenosis ) వంటి హృదయ కవాట గాయాలవల్ల కలిగే రోగాలకు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స ప్రధానంగా హృదయ కవాటాల పనితీరును పునరుద్ధరించడానికి నిర్వహిస్తారు. ఈ శస్త్రచికిత్సలో దెబ్బతిన్న కవాటాలకు మరమ్మత్తులు చేయడం ద్వారా లేదా కృత్రిమకవాటాల్ని దెబ్బతిన్నవాటి స్థానంలో భర్తీ చేయడం ద్వారా ఈ గుండెవ్యాధిని నయం చేస్తారు.