ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా) అంటే ఏమిటి ?
ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా) అనేది ఒక సాధారణ అంటువ్యాధి/సంక్రమణ, వైరస్ వలన కలుగుతుంది. ఇది దగ్గు మరియు తుమ్మల ద్వారా వ్యాపిస్తుంది.
ఏడాదిలో ఎప్పుడైనా ఫ్లూ సంక్రమించవచ్చు, కానీ సాధారణంగా, శీతాకాలంలో సంభవిస్తుంది; అందువల్ల దీనిని కాలానుగుణ (seasonal) ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇన్ఫ్లుఎంజాను RNA వైరస్లు కలిగిస్తాయి, ఇవి శ్వాసకోశ సంక్రమణకి (ఇన్ఫెక్షన్) కారణమవుతాయి. సాధారణ జలుబు వంటి ఇతర వైరల్ సంక్రమణలతో పోలిస్తే, ఇన్ఫ్లుఎంజా వైరస్ తీవ్రమైన అనారోగ్యంతో పాటు 0.1% మరణ రేటును కూడా కలిగిస్తుంది. తరచుగా, ఇన్ఫ్లుఎంజా ఒక వారం లేదా 10 రోజులలో తగ్గిపోతుంది.
65 ఏళ్ల వయస్సు పైబడిన పెద్దవారు మరియు 5 ఏళ్ల లోపు వయస్సులో పిల్లలు ఇన్ఫ్లుఎంజా వైరస్ వలన ప్రభావితమయ్యే ప్రమాదం ఎక్కువ. గర్భిణీ స్త్రీలు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో పని చేసేవారు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఇన్ఫ్లుఎంజా సంక్రమణ (ఇన్ఫెక్షన్) యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మొదట్లో, ఫ్లూ ఒక ఇతర సాధారణ జలుబులా అనిపించవచ్చు. గొంతు నొప్పి, ముక్కు కారడం, మరియు తుమ్ములు వంటి సాధారణ లక్షణాలు ఉండవచ్చు. జలుబు మరియు ఫ్లూ మధ్య ప్రధాన తేడా ఏమిటంటే, ఫ్లూ జలుబులా కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతుంది. లక్షణాలు సాధారణంగా సంక్రమణ వ్యాపించిన 1 నుండి 3 రోజులలో అభివృద్ధి చెందుతాయి మరియు సాధారణంగా ఒక వారం లోపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి.
ఫ్లూ యొక్క లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- 38C (100.4F) లేదా పైన ఉండే ఆకస్మిక జ్వరం
- గొంతు నోప్పి
- ఆకలి తగ్గుదల
- తలనొప్పి
- పొడి దగ్గు
- అతిసారం
- వికారం
- ముక్కు దిబ్బెడ
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇన్ఫ్లుఎంజా వైరస్లు ఫ్లూని కలిగిస్తాయి మరియు అవి మూడు రకములు - ఇన్ఫ్లుఎంజా ఏ (A), బి (B) మరియు సి (C). తరచుగా A మరియు B రకాలు, C రకం తో పోల్చితే శ్వాస మార్గములో తీవ్రమైన సంక్రమణం(ఇన్ఫెక్షన్) కలిగిస్తాయి మరియు అధిక మరణ రేటును కలిగి ఉంటాయి.
వైరస్ సంక్రమిత వ్యక్తి నుండి దగ్గు, తుమ్ములు లేదా మాట్లాడటం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. కొన్నిసార్లు, నేరుగా వైరస్ సంక్రమిత బిందువులను (droplets) పీల్చడం లేదా వైరస్తో కలుషితమైన ఉపరితలాలు తాకడం వలన కూడా వైరస్ సంక్రమించవచ్చు. లక్షణాలు మొదలయ్యే ముందు కూడా సోకిన వ్యక్తులు బాగా సాంక్రామికంగా (వ్యాధి వ్యాప్తి చేసేవారు) ఉంటారు (contagious)- మొదటి లక్షణం కనిపించే ఐదు రోజుల ముందు నుండి వారు సాంక్రామికంగా ఉంటారు.
ఇన్ఫ్లుఎంజా వైరస్లు, కాలంతో పాటు స్థిరమైన మార్పులను చెందుతూవుంటాయి, అంటే అవి మ్యుటేషన్ (mutation) చెందుతాయి. ఇది జీవిత కాలం పాటు వైరల్ ఇన్ఫెక్షన్ల అవకాశాన్ని కలిగిస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి మరియు ఎక్కువ నీరు త్రాగాలి. పరీక్ష కోసం వైద్యులని కూడా సంప్రదించాలి. పాలిమరెస్ చైన్ రియాక్షన్ (polymerase chain reaction [PCR]), రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (rapid antigen test) లేదా ఇమ్యునోఫ్లోరేసెన్స్ అసే (immunofluorescence assay) వంటివి జరపడం కోసం వైద్యులు మీ శ్వాస సంబంధిత నమూనాలను సేకరించవచ్చు.
అప్పుడు, వైద్యులు యాంటీవైరల్ మందులను సూచిస్తారు. ఈ యాంటీవైరల్ మందులకు వికారం మరియు వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.
జ్వరం మరియు అసౌకర్యాన్ని తగ్గించేందుకు యాంటీపైరెటిక్ మందులు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సూచించబడతాయి. శిశువులలో ఐతే, శిశువు శరీరంలో నీటి స్థాయిని నిర్వహించేందుకు తల్లి పాలివ్వడాన్ని పెంచాలి (అధికం చెయ్యాలి).