పిత్తాశయం రాళ్లు అంటే ఏమిటి?
ఉదర కోశంలో కుడివైపున పిత్తాశయం ఉంటుంది అది పియర్ పండు ఆకారంలో ఉంటుంది. పిత్తాశయ రాళ్ళు లేదా కోలెలిథియాసిస్ (cholelithiasis) అనేవి పిత్తాశయంలోని ఏర్పడిన కాల్షియం మరియు ఇతర లవణాలు యొక్క గట్టి రాయి వంటి డిపాజిట్లు (నిక్షేపణలు).
ఈ రాళ్లు పిత్తాశయ నాళాలను నిరోధిస్తాయి, దీనివల్ల నొప్పి మరియు ఇతర లక్షణాలు సంభవిస్తాయి.కొందరు అప్పుడప్పుడు, లక్షణాలు స్పష్టంగా కనిపించే వరకు వారి పిత్తాశయంలోని రాళ్ళు కలిగి ఉన్నారని గుర్తించలేరు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అనేక సందర్భాల్లో, పిత్తాశయ రాళ్ళు ఏ లక్షణాలను చూపవు. అవి చాలా కాలం పాటు పిత్తాశయంలో ఏవిధమైన లక్షణాలు చూపకుండా ఉండవచ్చు. అయినప్పటికీ, రాళ్ళు పిత్తాశయ నాళాలను అడ్డగించడం మొదలు పెట్టినప్పుడు లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో ఇవి ఉంటాయి
- ఉదరం యొక్క పైభాగం నుండి భుజం వరకు సంభవించే తీవ్ర నొప్పి
- వికారం మరియు వాంతులు
- పొత్తి కడుపు తిమ్మిరి
రాళ్ళు రెండు రకాలుగా ఉంటాయి:
- కొలెస్ట్రాల్ రాళ్ళు (Cholesterol stones)
- పిగ్మెంట్ రాళ్ళు (Pigment stones)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- బైల్ (పైత్య రసం) లో అధిక కొలెస్టరాల్ ఉండడం వలన అది కొలెస్ట్రాల్ రాళ్ళను కలిగించవచ్చు. బైల్ లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే, అది కరగదు మరియు గట్టిపడి రాళ్లుగా రూపొందుతుంది.
- బైల్ (పైత్య రసం) బిలిరుబిన్ (bilirubin) అనే పిగ్మెంట్ను కలిగి ఉంటుంది. కొన్ని రకాలైన కాలేయ వ్యాధులు లేదా రక్త కణలా రుగ్మతలలో, బిలిరుబిన్ అధికంగా ఏర్పడుతుంది, ఇది పిగ్మెంట్ రాళ్ళను ఏర్పరుస్తుంది.
- పిత్తాశయం సరిగ్గా పని చేయకపోతే, దానిలోని పదార్దాలు ఖాళీ చేయబడవు (బయటకు వెళ్ళలేవు) మరియు అవి అధికంగా పోగుపడి రాళ్ళను ఏర్పరుస్తాయి.
- మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం మరియు నోటి ద్వారా గర్భనిరోధకాలు వంటివి కొన్ని ప్రమాద కారకాలు.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు లక్షణాలను అంచనా వేసి రాళ్ళను పరిశీలించడం కోసం సిటి (CT) స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ ను సూచిస్తారు.రోగ నిర్ధారణలో కాలేయం మరియు పిత్తాశయం యొక్క ఆరోగ్యాన్ని (పరిస్థితిని) పరీక్షించడానికి కాలేయ పనితీరు పరీక్ష(liver function) ను నిర్వహిస్తారు. పిత్త వాహిక అడ్డంకిని/నిరోధాన్ని తనిఖీ చేయడానికి, పిత్త వాహిక ద్వారా ప్రయాణించే ఒక ప్రత్యేక డైను ఉపయోగించి దానిని ఎక్స్-రే ద్వారా పరీక్షిస్తారు. రక్త పరిశోధనలు కూడా ఏవైనా సంబంధిత సమస్యలను మరియు అంటురోగాలను/సంక్రమణలను తెలుసుకోవడానికి సహాయపడతాయి.
పిత్తాశయ రాళ్లు ఉన్న రోగికి ఏవిధమైన లక్షణాలు లేకుండా ఉంటే, చికిత్స అవసరం లేదు. పిత్తాశయ రాళ్లు పునరావృత్తమవుతూ ఉంటే వాటిని పరిష్కరించడానికి శస్త్రచికిత్స చేసి పిత్తాశయాన్ని తొలగించడం అనేది ఒక ఉత్తమ మార్గం. శస్త్రచికిత్స తర్వాత పిత్తాశయం లేకపోవడం అనేది శారీరక విధులను ప్రభావితం చేయదు. అరుదుగా, రాళ్ళు కరిగించడానికి మందులను ఉపయోగిస్తారు. అయితే, ఇవి శస్త్రచికిత్స పద్ధతి వలె సమర్థవంతంగా ఉండవు, మరియు రాళ్లు పునరావృత్తమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.