జియార్డియాసిస్ విరేచనాలు అంటే ఏమిటి?
చిన్నపేగుల్లో “జియార్డియా లాంబ్లియా” అనే ఒక పరాన్నజీవి (parasite) కారణంగా సోకే అంటు వ్యాధి ఈ ‘జియార్డియాసిస్’ విరేచనాలు. జియార్డియా లాంబ్లియా అనే సూక్ష్మజీవి ఇతర జీవులైన మానవులు, పెంపుడు జీవులైన పిల్లులు మరియు కుక్కలు, లేదా పశువులైన ఆవులు, గొర్రెలు వంటి జంతువులలో పరాన్నజీవిగా జీవిస్తుంది. ఇది అతిధేయి (host) యొక్క ప్రేగులలో నివసిస్తుంది మరియు తన చుట్టూ ఒక తిత్తి (cyst) లేదా కవచాన్ని ఏర్పరచుకుంటుంది. మలవిసర్జన సమయంలో ఈ తిత్తి మలంతోపాటు విడుదల అయి, అందులోని పరాన్నజీవులు మరొక అతిధేయను (host) ప్రవేశించేంత వరకూ శరీరానికి వెలుపలనే జీవిస్తూ ఉంటాయి.
భారతీయ జనాభాలో ఈ జియార్డియాసిస్ విరేచనాల వ్యాధి ప్రబలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో దీని ప్రాబల్యం రేటు 5.5-70% వరకు ఉంటుంది, దక్షిణాన 8-37.1% మధ్య ఉంటుంది. పెద్దల కంటే పిల్లలకే ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
జియర్డియాసిస్ విరేచనాల అంటు సోకిన 7-25 రోజుల్లోగా రోగిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే, సాధారణంగా కనిపించే ఈవిరేచనాల వ్యాధి లక్షణాలు ఏవంటే
- నీళ్ల విరేచనాలు
- ఉబ్బరం లేదా కడుపు నుండి (అపానవాయువు) వాయువు విడుదల
- తిమ్మిరి
- వికారం
- డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)
- బలహీనత
- బరువు నష్టం
జ్వరం కూడా ఉండవచ్చు, కానీ అరుదుగా ఉంటుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జియార్డియాసిస్ భేదులవ్యాధి చిన్న ప్రేగులలో పరాన్నజీవి జియార్డియా ఇంటెస్టినాలిస్ లేదా జియార్డియా లాంబ్లియా వల్ల సోకుతుంది. ఇది ప్రధానంగా ఈ పరాన్నజీవులతో (కూడిన తిత్తులతో) కలుషితమైన ఆహారం మరియు నీటిని సేవించడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ భేదుల సంక్రమణ విస్తరించే ఇతర మార్గాలు
- శుద్ధి చేయని నీటిని తాగటం వల్ల ఈ భేదులవ్యాధి సోకుతుంది. ముఖ్యంగా సరస్సులు, నదులు లేదా కాలువల నుండి నీటిని శుద్ధి చేయకుండా తాగటంవల్ల ఈ భేదులవ్యాధి రావచ్చు, ప్రత్యేకంగా బాటసారులకు (hikers)
- జియార్డియాసిస్ పరాన్నజీవి ఉన్న కొలనుల్లో (pools) ఈత కొట్టడంవల్ల
- ఈ వ్యాధి కల్గిన వ్యక్తితో పాయువు మార్గం ద్వారా లైంగిక సంపర్కం చేయడంవల్ల
- ఉడకబెట్టని మాంసం తినడంవల్ల
- టాయిలెట్ ఉపయోగించిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోక పోవడంవల్ల
ఇది మానవ సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది కానీ రక్తం ద్వారా కాదు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ వ్యాధి లక్షణాలను ఆధారంగా మీ డాక్టర్ మీ పేగుల్లోని సూక్ష్మజీవులను గుర్తించడానికి మలం పరీక్ష చేయించమని అడుగుతారు. మలపరీక్షకోసం, మీరు మీ మలం (స్టూల్) నమూనాలను అనేకసార్లు సేకరించి వైద్య పరీక్షలకు అందించవలసి ఉంటుంది.
జియార్డియాసిస్ భేదుల వ్యాధి చికిత్సకు అంటిమైక్రోబియాల్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. చికిత్స సాధారణంగా 3-7 రోజుల వరకూ కొనసాగుతుంది. ఔషధాలతో పాటు, అతిసారం కలిగే నిర్జలీకరణాన్ని నివారించడానికి సరైన అధికమొత్తంలో నీటిని తాగాలి. .
మీరు ఈ భేదుల సంక్రమణను ఈ విధంగా నిరోధించవచ్చు
- చెరువులు, గుంటలు, నది లేదా సరస్సుల నుండి నీటిని త్రాగటాన్ని తప్పించటం ద్వారా
- వేడి చేసిన నీటిని మాత్రమే త్రాగటం ద్వారా
- టాయిలెట్ ను ఉపయోగించిన తర్వాత లేదా పిల్లల డైపర్లను మార్చిన తర్వాత సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం ద్వారా
మీరు మీ కుటుంబ సభ్యులను లేదా ఇతరులను ఈ భేదులవ్యాధి బారి నుండి రక్షించుకోవడానికి కింది చర్యలు తీసుకోవచ్చు:
- జియార్డియాసిస్ విరేచనాల వ్యాధి సోకిన బిడ్డను స్కూలుకు లేదా డేకేర్కు పంపించకుండా ఉండడం. అతిసారం తగ్గిన తర్వాత 24 గంటల గడిచిన తర్వాత పంపొచ్చు.
- ఒకవేళ ఈ వ్యాధి లక్షణాలను మీరు కలిగి ఉంటే మీరు ఆహారం వండడం, సిద్ధం చేయడం వంటివి మీకు నిషిద్ధం..
- వ్యాధి లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యే వరకు గృహ వస్తువులను ఎవరితోనూ పంచుకోకుండా ఉండడం.