హైపర్ క్యాల్సీమియా అంటే ఏమిటి?
రక్తంలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో కాల్షియం ఉండే పరిస్థితినే “హైపర్ క్యాల్సీమియా” గా పిలుస్తారు. లేక రక్తంలో పెరిగిన అయనీయ కాల్షియం పరిస్థితినే హైపర్ క్యాల్సీమియా రుగ్మతగా పరిగణిస్తారు. జనాభాలో 0.5% నుంచి 1% మందిని హైపర్ క్యాల్సీమియా బాధిస్తోంది. శరీరంలో అధిక కాల్షియం ఉంటే గుండె, మూత్రపిండాలు మరియు మెదడు వంటి కీలక అవయవాలకు కీడు వాటిల్లి అమితమైన బాధ కల్లుతుంది మరియు ఎముకలు బలహీనపడటం జరుగుతుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ లక్షణాలు:
- కేంద్ర నాడీ వ్యవస్థ: మైకం (స్తూపర్), మందకొడితనం, కోమా, మానసిక మార్పులు, మతిభ్రమ (సైకోసిస్)
- జీర్ణ వ్యవస్థ: ఆకలి లేకపోవడం (అనోరెక్సియా), యాసిడ్ పెప్టిక్ వ్యాధి, మలబద్ధకం, ప్యాంక్రియాటైటిస్
- మూత్రపిండాలు (కిడ్నీలు): మూత్రపిండంలో రాళ్లు (నెఫ్రోలిథియాసిస్), అతిమూత్రం (పాలీయూరియా)
- మస్క్యులోస్కెలెటల్ సిస్టం: కీళ్ళనొప్పులు (ఆర్త్రల్జియా), కండరాల నొప్పి (మైయాల్జియా)
- రక్తనాళ వ్యవస్థ: రక్తపోటు
అప్పుడప్పుడు తీవ్రమైన లక్షణాలు సంభవించవచ్చు:
- సైనస్ అరెస్ట్ (గుండెలోని సైనోట్రియల్ గ్రంధి విధిలోపం)
- గుండె యొక్క రక్త ప్రసరణలో కల్లోలాలు
- మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లాంటి లక్షణాలు
హైపర్ క్యాల్సీమియాకు ప్రధాన కారణాలు ఏమిటి?
హైపర్కాల్కేమియా యొక్క సాధారణ కారణాలు:
- పారాథైరాయిడ్ గ్రంధి అసాధారణమైన చురుకుదనం: ఈ గ్రంధి విస్తరణ వలన ఇది సంభవిస్తుంది.
- పారాథైరాయిడ్ గ్రంధుల్లో ఒకదానిపై పెరుగుదల కారణంగా పారాథైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తి
ఇతర కారణాలు:
- ఊపిరితిత్తుల మరియు రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ లు ఎముకలకు వ్యాప్తి చెందుతాయి
- క్షయవ్యాధి మరియు సార్కోయిడోసిస్ వంటి వ్యాధులు
- వారసత్వ కారకాలు
- అధిక కాల్షియం మరియు విటమిన్ డి సప్లిమెంట్స్, లిథియం మరియు మూత్రవిసర్జన మందుల సేవనం
- అచలత్వం (కదలలేని స్థితి) మంచానికి పరిమితమైపోవడం లేదా కొన్ని వారాల పాటు నిష్క్రియాత్మకంగా ఉండిపోవడం.
- దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి
- తీవ్రమైన డీహైడ్రేషన్
- ముట్లుడిగిన (postmenopausal) మహిళలకు హైపర్ క్యాల్సీమియా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది
హైపర్ క్యాల్సీమియాను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
హైపర్ క్యాల్సీమియాను నిర్ధారణ చేయడానికి పూర్తి రక్త గణన (complete blood count) అనే ఒక సాధారణ రక్త పరీక్షతో పాటు కొన్ని ఇతర పరిశోధనలు సహాయపడతాయి.
మరేదైనా అనుమానిత అంతర్లీన ఆరోగ్య స్థితిని నిర్ధారించడానికి మీ డాక్టర్ అదనపు పరీక్షలను కూడా సిఫారసు చేయవచ్చు.
వైద్య పరిశోధనా పరీక్షలు ఇలా ఉంటాయి:
- సీరం కాల్షియం, పారాథైరాయిడ్ హార్మోన్ మరియు విటమిన్ డి స్థాయిల్ని కొలవడానికి పరీక్షలు
- మూత్ర కాల్షియం స్థాయిలు కొలిచేందుకు పరీక్షలు
మీ డాక్టర్ మీ రక్త కాల్షియం స్థాయిని నియంత్రించడానికి మందులను సిఫారసు చేయవచ్చు.
ప్రాధమిక హైపర్ ప్యారాథైరాయిడిజం విషయంలో, శస్త్రచికిత్స చేయించుకోవలసి ఉంటుంది.
తీవ్రమైన హైపర్ క్యాల్సీమియా విషయంలో బిస్ఫాస్ఫోనేట్లు, స్టెరాయిడ్స్ లేదా డయూరిటిక్స్ వంటి నరాలకు ఎక్కించే ఇంట్రావీనస్ ద్రవ చికిత్స మరియు మందులసేవనం అవసరం కావచ్చు.
మూత్రపిండాల వైఫల్యం విషయంలో మీ డాక్టర్ డయాలిసిస్కు సలహా ఇస్తారు.