ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?
పల్మనరీ ఫైబ్రోసిస్ ఒక అసాధారణమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో ఊపిరితిత్తుల కణజాలం పై మచ్చలు ఏర్పడతాయి మరియు మందముగా మారుతుంది. ఈ మచ్చలను ఫైబ్రోసిస్ అని అంటారు. తరచుగా వ్యాధికి కారణం తెలియదు అందుకే దీనిని ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF, idiopathic pulmonary fibrosis) అని పిలుస్తారు. ఇది మధ్య వయస్కులను లేదా వృద్ధులను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. ఇది శ్వాసకోశ వైఫల్యం,పల్మనరీ హైపర్ టెన్షన్, గుండె వైఫల్యం, పల్మోనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే (అందించే) ధమనులలో రక్తం గడ్డకట్టడం) మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF) తో ముడిపడి ఉండే లక్షణాలు:
- ఏదైనా పని చేస్తున్నప్పుడు పొడి దగ్గు సంభవించడం
- ఊపిరి ఆడకపోవడం
- ఊపిరితిత్తుల నుండి చిటపటమనే శబ్దం వినిపించడం
- చేతివేళ్లు దగ్గరగా అయ్యిపోవడం (Clubbing)
- కండరాల నొప్పి మరియు కీళ్ళ నొప్పి
- ఆకలి తగ్గుదల
- బరువు తగ్గుదల
- ఛాతీ నొప్పి లేదా బిగుతుగా అనిపించడం
- అలసట లేదా నీరసం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ యొక్క నిర్దిష్ట కారణం తెలియదు కానీ కొన్ని పర్యావరణ కారకాలు మరియు కాలుష్య కారకాలు పల్మోనరీ ఫైబ్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. ధూమపానం, మెటల్ డస్ట్(కొన్ని లోహముల యొక్క ధూళి), కలప దుమ్ము, రాళ్ళ ధూళి, సిలికా, ఎండు గడ్డి దుమ్ము, మౌల్డ్ స్పార్స్ లేదా వ్యవసాయ ఉత్పత్తులు వంటి కారకాలు పల్మోనరీ ఫైబ్రోసిస్ సంభవించడానికి కారణం అవుతాయి. ఎక్కువగా పురుషులు ప్రభావితమవుతారు మరియు 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల్లో ఇది తరచుగా సంభవిస్తుంది.
ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న 20% మంది వ్యక్తులలో వారి కుటుంబంలో మరొకరు ఇంట్రస్టీషియల్ (మధ్యంతర) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మంది సభ్యులు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, దానిని ఫ్యామిలియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ అని పిలుస్తారు.
ఇడియోపెథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF) ఉన్న 75% మంది రోగులలో గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) కూడా ఉంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
లక్షణాలు తరచుగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), మరియు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి వ్యాధుల లక్షణాల వలె ఉంటాయి కాబట్టి, ఈ వ్యాధి నిర్దారణకు పుల్మోనోలజిస్ట్ (pulmonologist) , రేడియాలజిస్ట్ (radiologist) మరియు పాథాలజిస్ట్ (pathologist) ల యొక్క సమగ్ర సలహాలు అవసరం. రోగి యొక్క ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష మరియు ఎక్స్-రే , హై రిజల్యూషన్ కంప్యుట్ టోమోగ్రఫీ (CT), ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, పల్స్ ఆక్సిమెట్రీ, ఆర్టెరీయల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్, క్షయ వ్యాధి కోసం చర్మ పరీక్ష, వ్యాయామ పరీక్ష (exercise testing), మరియు ఊపిరితిత్తుల బయాప్సీ ఆధారంగా వైద్యులు రోగ నిర్దారణ చేస్తారు.
వైద్యులు ఈ పరిస్థితికి మందుల ద్వారా, ఆక్సిజన్ థెరపీ, పల్మనరీ రీహాబిలిటేషన్ మరియు ఊపిరితిత్తుల మార్పిడి వంటి వాటితో చికిత్స చేయవచ్చు. శ్వాస ఆడకపోవడానికి మరియు దగ్గు చికిత్సకు కొన్ని అదనపు మందులు సూచించబడతాయి. గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) కోసం యాంటాసిడ్ థెరపీ కూడా సూచించబడుతుంది.