షిజెల్లోసిస్ అంటే ఏమిటి?
షిజెల్లోసిస్ అనేది షిజెల్లా (Shigella) అని పిలువబడే బ్యాక్టీరియా సమూహం వలన సంక్రమించే ఒక అంటువ్యాధి/ఇన్ఫెక్షన్. షిజెల్లోసిస్ యొక్క అత్యంత సాధారణ లక్షణం అతిసారం, దాని తరువాత జ్వరం మరియు కడుపు తిమ్మిర్లు కలుగుతాయి. ఈ వ్యాధి యొక్క ప్రసార (వ్యాప్తి) మార్గం ఫీకో-ఓరల్ (మల-నోటి) మార్గం అందువలన పారిశుధ్యం మరియు పరిశుభ్రత తక్కువగా ప్రాంతాల్లోని పిల్లలు తరచుగా ప్రభావితమవుతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఒక వ్యక్తి బ్యాక్టీరియాకు గురైన (బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన) 1 లేదా 2 రోజులలో లక్షణాలను అనుభవించవచ్చు.
సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- శ్లేష్మం (mucus), రక్తం మరియు చీముతో కూడిన విరేచనాలు
- జ్వరం
- కడుపులో తిమ్మిర్లు
- మలవిసర్జన యొక్క అసంపూర్ణ భావన
- అలసట
- వికారం
- వాంతులు
అరుదైన లక్షణాలు:
- పోస్ట్ ఇన్ఫెక్షియస్ ఆర్థ్రయిటిస్ (సంక్రమణ/ఇన్ఫెక్షన్ తర్వాత సంభవించే కీళ్ల వాపు): కంటి దురద, కీళ్ళ నొప్పులు మరియు మూత్రవిసర్జన సమయంలో నొప్పి
- రక్తప్రవాహలో సంక్రమణలు (Bloodstream infections): ఇది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిలో సంభవిస్తుంది, హెచ్ఐవి, పోషకాహారలోపం మరియు క్యాన్సర్ వంటి సమస్యలలో దీనిని గమనించవచ్చు
- మూర్చ
- హీమోలిటిక్-యురేమిక్ సిండ్రోమ్ (Haemolytic-uraemic syndrome)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఒక వ్యక్తి అనుకోకుండా షిజెల్లా బ్యాక్టీరియాను తినేసినప్పుడు (షిజెల్లాతో కలుషితమైన ఆహార పదార్థలను తిన్నపుడు) షిజెల్లోసిస్ సంభవిస్తుంది.
షిజెల్లోసిస్ యొక్క కారణాలు:
- ఇది షిజెల్లా బాక్టీరియా సోకిన ఒక వ్యక్తికి దగ్గరగా ఉండడం లేదా తాకడం ద్వారా వ్యాపిస్తుంది.
- కలుషితమైన ఆహారం తినడం
- కలుషితమైన నీరును తాగడం
- పిల్లల సంరక్షణా కేంద్రాలలో (childcare centres), జైళ్లు మరియు ఆసుపత్రిలో పనిచేసే వ్యక్తులు లేదా పారిశుధ్యం మరియు పరిశుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసించే వ్యక్తులకు షిజెల్లోసిస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
షిజెల్లోసిస్ వ్యాధి నిర్ధారణలో ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం మరియు లక్షణాల పరిశీలన సహాయం చేస్తాయి. వైద్యులు షిజెల్లా బాక్టీరియా మరియు వాటి టాక్సిన్లను గుర్తించడానికి మల పరీక్షను ఆదేశిస్తారు.
షిజెల్లోసిస్ నిర్వహణ వీటిని కలిగి ఉంటుంది:
- షిజెల్లోసిస్ సాధారణంగా 5 నుండి 7 రోజుల వ్యవధిలో దానికదే తగ్గిపోతుంది.
- తేలికపాటి షిజెల్లోసిస్ కోసం తగినంత ద్రవాలు తీసుకోవడం అవసరం.
- శరీరంలోని ద్రవాల యొక్క నష్టాన్ని భర్తీ చేయడానికి పుష్కలంగా నీరు తాగడం అవసరం.
- శరీరం కోల్పోయిన ఉప్పులను (salts) మరియు ద్రవాలను తిరిగి భర్తీ చేయడానికి నిమ్మరసం, మజ్జిగ, ఇంట్లో తయారు చేసిన ఓ ఆర్ యస్ (ORS), కొబ్బరి నీరు వంటి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) ను తప్పనిసరిగా తీసుకోవాలి.
- కొన్ని సందర్భాల్లో వేగవంతమైన ఫలితాల కోసం (లక్షణాల తగ్గుదల కోసం) ఇంట్రావీనస్ (నరాలలోకి) ద్రవాలను ఇవ్వవవచ్చు/ఎక్కించవచ్చు.
- షిజెల్లోసిస్ యొక్క తీవ్రమైన కేసులలో మాత్రమే యాంటీబయాటిక్ చికిత్స అవసరమవుతుంది. శిశువులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు మరియు హెచ్ఐవి(HIV)తో బాధపడుతున్న వ్యక్తులకు యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి.