టేప్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?
టేప్ వార్మ్ లు హోస్ట్ యొక్క (మానవులు, జంతువులు) ప్రేగులు లోపల నివసించే ఒక రకమైన ఏలిక పాములు (ఫ్లాట్ వార్మ్ లు). టేప్ వార్మ్ లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అవి అనేక జీవసంబంధ సమస్యలు కలిగిస్తాయి దానిని టేప్ వర్మ్ ఇన్ఫెక్షన్ అని అంటారు.
టేప్ వర్మ్లు వాటి గుడ్లు లేదా లార్వాల ద్వారా కూడా ఒక వ్యక్తికి సంక్రమణ/ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- టేప్ వర్మ్ ఇన్ఫెక్షన్ యొక్క ప్రారంభ లక్షణాలు వికారం మరియు వాంతులు. రోగికి బలహీనత, అలసట మరియు అతిసారంతో పాటుగా జ్వరం కూడా అభివృద్ధి చెందుతుంది.
- వ్యక్తి సాధారణంగా అతని ఆకలిని కోల్పోతాడు. దీనికి విరుద్ధంగా, కొన్నిసార్లు బాగా ఆకలి పెరిగిన భావనను కూడా అనుభవించవచ్చు (సాధారణ కన్నా ఎక్కువ ఆకలి).
- టేప్ వర్మ్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినట్లైతే, అప్పుడు తలనొప్పి మరియు మూర్ఛ వంటి తీవ్రమైన నరాల సమస్యలు కలుగుతాయి.
- టేప్ వార్మ్ విడుదల చేసిన అలెర్జీ కారకాల (allergens) వల్ల రోగిలో అలెర్జీ ప్రతిచర్యలు మరియు దద్దుర్లు కూడా అభివృద్ధి చెందుతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- వ్యాధి సంక్రమిత గొడ్డు మాంసం మరియు పంది మాసం తినడం వల్ల మానవులకి ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఇన్ఫెక్షన్ మూలం (source) ఆధారంగా, మానవులకు హాని కలిగించే ఆరు ప్రధాన రకాల టేప్ వర్మ్ లు ఉన్నాయి.
- వ్యాధి సోకిన జంతువు యొక్క పచ్చి లేదా సరిగ్గా వండని మాంసం తినడం లేదా కలుషితమైన నీరు త్రాగడం అనేది సంక్రమణకు కారణమవుతుంది.
- వ్యాధి సోకిన వ్యక్తి తయారుచేసిన ఆహారం తిన్న వ్యక్తి కూడా వ్యాధి వ్యాపించవచ్చు.
- అపరిశుభ్రమైన చేతులతో వంట చెయ్యడం మరియు ఆహారాన్ని తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉండడం వంటివి కూడా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- ఒక వ్యక్తి టేప్ వర్మ్ ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఉన్నట్లయితే, మలంలో టేప్ వర్మ్ల లేదా వాటి గుడ్ల యొక్క తనిఖీ కోసం మల నమూనా సేకరించబడుతుంది.
- కొన్నిసార్లు అనేక మల నమూనాలను సేకరిస్తారు, ఎందుకంటే టేప్ వర్మ్ లు సేకరించిన నమూనాలో లేనప్పటికీ వ్యక్తి సంక్రమణను కలిగి ఉండవచ్చు.
- ప్రత్యేకించి ఉదరంలో వాపు లేదా తిత్తి యొక్క అనుమానం ఉంటే కనుక, సిటి (CT) స్కాన్లు, ఎంఆర్ఐ (MRI) లేదా ఆల్ట్రాసౌండ్ను కూడా రోగనిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు.
- శరీరంలో ఒక సంక్రమణం ఉంటే మరియు టేప్ వర్మ్ లకు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీలు ఏర్పడినట్లయితే వాటిని రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.
- కొన్నిసార్లు, ఒక వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ టేప్ వర్మ్ శరీరంలో ఉంటుంది.
- ఈ సంక్రమణకు నిర్దిష్టమైన మందులు సూచించబడతాయి. మందుల యొక్క మొత్తం కోర్సు పూర్తి చేయడం చాలా ముఖ్యం.
- టేప్ వార్మ్లు మరియు వాటి గుడ్లను చంపడానికి సూచించే అల్బెన్దజోల్ (albendazole) లాంటి యాంటి-హెల్మింథిక్ (anti-helminthic) మందులతో పాటుగా నొప్పి లేదా వాపు ఉంటే, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వంటి ఇతర ఔషధాలు కూడా ఇవ్వబడతాయి.
- తీవ్రమైన సందర్భాల్లో, కాలేయంలో లేదా ఊపిరితిత్తుల్లో తీవ్ర సంక్రమణ ఏర్పడినట్లైతే, శస్త్రచికిత్సా తొలగింపు అవసరమవుతుంది.
- ప్రతి రోగి మంచి వ్యక్తిగత పరిశుభ్రతని నిర్వహించాలి మరియు మళ్ళి వ్యాధి సోకకుండా నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.