పట్టుపురుగుచెట్టు పండ్లను లేదా మల్బరీ చెట్టు పండ్లను సాధారణంగా “మోరస్” అని పిలుస్తారు, ఇది మొరాసి కుటుంబానికి చెందినది. ఈ మొక్క అడవిలో పెరుగుతుంది, కానీ దాని వివిధ ప్రయోజనాల కోసం విస్తృతంగా సాగు చేస్తున్నారిపుడు. భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో మల్బెర్రీ చెట్లను (రేషం చెట్లు) పట్టుపురుగుల మేత కోసం పండించడం జరుగుతోంది. ముడి పట్టును ఉత్పత్తి చేసే పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగపడే మల్బరీచెట్లు సాధారణంగా తెలుపు, ఎరుపు మరియు నలుపు రంగులలో కనిపిస్తాయి. ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మరియు భారత ఉపఖండంలో మల్బరీ పండ్ల వాడకం విస్తృతంగా ఉంది. మల్బరీలు గ్రీస్‌లో కూడా విస్తృతంగా వ్యాపించాయి, ముఖ్యంగా మధ్య యుగాలలో ‘మోరియా’ అని పిలువబడే పెలోపొన్నీస్‌లో, దీని నుండి ‘మోరస్’ అనే పదం ఉద్భవించింది.
సంప్రదాయకంగా గ్రీస్‌లో, మల్బరీలను వారి జ్ఞానదేవత మినర్వాకు అంకితం చేశారు. సంప్రదాయ చైనా మూలికావైద్యం మందుల్లో గుండె జబ్బులు, మధుమేహం, రక్తహీనత మరియు ఆర్థరైటిస్ చికిత్సకు మల్బరీలను శతాబ్దాలుగా ఉపయోగించారు. ఇది జానపద ఔషధాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తూ వస్తున్నారు, ముఖ్యంగా తామర చికిత్స కోసం. ఆయుర్వేదంలో, మూత్ర సంక్రమణ, పేగు పురుగు బారిన పడటం మరియు చర్మ వ్యాధుల చికిత్స కోసం మల్బరీలను ఉపయోగించారు.
చారిత్రకంగా, మల్బెర్రీ పట్టు పరిశ్రమ అభివృద్ధితో ముడిపడి ఉంది. ఓరియంట్ ప్రాంతంగా పిలువబడే ఆసియా దేశాల్లో మల్బెర్రీ ఆకుల్ని పట్టు పురుగుల్ని (రేషం పురుగులని వీటిని పిలుస్తారు) బాగా లావుగా పెంచడానికి మేతగా ఉపయోగిస్తారు. ఈ పురుగులు ఉత్పత్తి చేసే పట్టు గూళ్ళను ఉపయోగించి పట్టు పోగుల్నిలేదా పట్టుదారాలను తయారుచేసి పట్టు చీరలు, తదితర వస్త్రాలను నేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మల్బెర్రీ చెట్ల పంట వ్యాపించిందీ అంటే అది పట్టు పురుగుల పరిశ్రమ కారణంగానే. పట్టుపురుగుల మేతకోసం మల్బెర్రీ చెట్లను విశ్వవ్యాప్తంగా సాగు చేస్తున్నారు.
మల్బెర్రీ చెట్టు చిన్నదిగా ఉన్నపుడు, అంటే నాటిన సమయంలో, వేగంగా పెరుగుతుంది, 10 నుండి 15 మీటర్ల వరకూ పెరుగుతుంది, కానీ ఆ తర్వాత పెరగడం మానేస్తుంది. మల్బరీ అసంఖ్యాకమైన పండ్లను గుత్తులు గుత్తులుగా కలిగి ఉంటుంది, సాధారణంగా పండ్లు చిన్నవిగా ఉన్నపుడు ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉండి, పండ్లుగా మాగినపుడు ఎరుపు, నలుపు లేదా తెలుపు రంగులోకి వాటి వాటి జాతులను బట్టి మారుతాయి. పండిన మల్బెర్రీ పండ్లు తీపి రుచిని కల్గి ఉంటాయి.
మల్బరీ (షాహూట్) గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): మోరస్ ఆల్బా (Morus alba)
- కుటుంబం: మొరాసి (Moraceae)
- సాధారణ పేరు: మోరస్, మల్బరీ, పట్టుపురుగుచెట్టు పండ్లు, రేషంచెట్టుపండ్లు
- సంస్కృత నామం: షాహూత్
- ఉపయోగించే భాగాలు: పండ్లు, ఆకులు, బెరడు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉపఉష్ణమండల మరియు సమశీతోష్ణ ప్రాంతాలకు స్థానికం