దగ్గు - Cough in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

May 21, 2019

September 11, 2020

దగ్గు
దగ్గు

సారాంశం

దగ్గు అనేది శ్వాసకోశ మార్గాలు మరియు గొంతులోని శ్లేష్మం మరియు పొగ లేదా ధూళి వంటి చికాకులను తొలగించే ఒక ఒత్తిడితో కూడిన చర్య. పొడి దగ్గు గొంతులో ఎటువంటి కఫాన్ని (చిక్కని శ్లేష్మం) ఉత్పత్తి చేయకుండా  కిచ్ కిచమనే సంచలనాన్ని కలిగిస్తుంది. అయితే తడి దగ్గు కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది వాయుమార్గాన్ని శుభ్రం చేస్తుంది. చాలామందిలో, ఏ మందుల అవసరం లేకుండా మూడు వారాల లోపు దగ్గు తగ్గిపోతుంది. అయితే, దగ్గు నిరంతరంగా ఉంటే కనుక, తక్షణ చికిత్స కోసం వైద్యులను సంప్రదించడం మంచిది.

ఉదాహరణకు, ఫ్లూ, సైనసైటిస్, లారింజైటిస్, అలెర్జిక్ రినైటిస్ లేదా ఆస్తమా, దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక వ్యాధులు నిరంతర దగ్గును కలిగించేటువంటి అనేక ఆరోగ్య సమస్యలు. స్వల్పకాలిక దగ్గుకు మందులు అవసరం ఉండదు ఎందుకంటే అది కొన్ని వారాలలోనే తగ్గిపోతుంది. తగినంత ద్రవాలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం మరియు సాధారణ గృహ చిట్కాలు దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి. ఒక నిర్దిష్ట కారణం వలన దగ్గు సంభవిస్తే, ఆ కారణానికి చికిత్స చేయడం వలన దగ్గు తగ్గుతుంది. అరుదైన సందర్భాల్లో, నిరంతర దగ్గు ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య వలన కావచ్చు, ఉదాహరణకు, క్షయవ్యాధి లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటివి, వీటికి సకాలంలోనే చికిత్స అందించాలి. ఈ వ్యాసంలో దగ్గు గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.

దగ్గు అంటే ఏమిటి? - What Is cough? in Telugu

దగ్గు అనేది పుట్టుకతో వచ్చే ఒక రక్షిత ప్రతిచర్య క్రియ. ఒక ప్రేరేపణ ఉదాహరణకు చికాకు కలిగించే పదార్థం, వంటి వాటికీ మన శరీరం స్వయంగా చూపే ఒక రకమైన ప్రతిచర్య దగ్గు. మన శ్వాస మార్గాలు మరియు గొంతు ఈ చికాకు కలిగించే పదార్దాలను గుర్తించే నరములను కలిగి ఉంటాయి. ఒక చికాకు కలిగించే పదార్థం నరములు ప్రేరేపిస్తే, అవి (నరములు) మెదడుకు సంకేతాలను పంపుతాయి. మెదడు ఛాతీ గోడల కండరాలకు మరియు పొత్తికడుపుకు సంకేతాలను పంపుతుంది, దీని ప్రతిస్పందనగా వ్యక్తి ఘాడ శ్వాస తీసుకుంటాడు, చికాకు కలిగించే పదార్దాన్ని తొలగించే ప్రయత్నంగా శ్వాస వేగంగా మరియు బలవంతంగా కూడా విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం చర్య చాల వేగవంతమైనది, ఒక రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుంది మరియు ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దగ్గు గొంతు మరియు ఊపిరితిత్తుల నుండి బయటి పదార్దాలను మరియు గాలిని దాదాపు గంటకు 50 మైళ్ళు వేగంతో నెట్టగలదు.

దీర్ఘకాలికమైన దగ్గు మరియు కఫంతో కూడిన నిరంతర దగ్గు అనేవి అంతర్లీన శ్వాసకోశ అనారోగ్యానికి ముఖ్యమైన సూచికలు. ఈ లక్షణాలు వివిధ ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల్లో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ లక్షణాలుకు మరియు సిఓపిడి (COPD) వంటి ప్రాణాంతక శ్వాస సంబంధిత వ్యాధులకు మధ్య బలమైన సంబంధం ఉందని వివిధ అధ్యయనాలు తెలిపాయి.

Tulsi Drops
₹286  ₹320  10% OFF
BUY NOW

దగ్గు లక్షణాలు - Cough symptoms in Telugu

దగ్గు శ్వాస వ్యవస్థ, హృదయనాళ (గుండె) వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ లేదా ఇతర శరీర వ్యవస్థలకు సంభందించిన అంతర్లీన వ్యాధికి ఒక లక్షణం. ఇది ఇతర రోగ లక్షణాలతో ముడిపడి ఉంటుంది, అసలు వ్యాధిని నిర్ధారించడంలో సహాయం చేస్తుంది. దగ్గుకు సంబంధించిన కొన్ని సాధారణంగా లక్షణాలు:

  • గొంతు మంట
  • తినేటప్పుడు మింగడంలో కఠినత, ముఖ్యంగా పిల్లల్లో ఇది కనిపిస్తుంది
  • ఛాతీలో మంట సంచలనం లేదా గుండె మంట
  • రాత్రి సమయంలో చెమటలు
  • జ్వరం మరియు చలి
  • బరువు తగ్గుదల
  • ఛాతి నొప్పి
  • చెవి నొప్పి
  • దగ్గుతున్నపుడు కఫంలో రక్తం పడడం
  • శారీరక శ్రమను చెయ్యడంలో సామర్థ్యం తగ్గిపోవడం
  • శ్వాసలో సమస్య
  • శ్వాస తీసుకునేటప్పుడు ఈల-లాంటి ధ్వని, అంటే, శ్వాసలో గురక

దగ్గు కారణాలు మరియు ప్రమాద కారకాలు - Cough causes and risk factors in Telugu

కారణాలు

దగ్గు యొక్క కారణాలను దాని మూలం ఆధారంగా వర్గీకరించవచ్చు.

శ్వాస సంబంధిత కారణాలు

  • అంటురోగ/సంక్రమణ కారణామైనవి
    • ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణలు: ఎగువ శ్వాసకోశ మార్గ అంటురోగాలు/సంక్రమణలు చాలా సాధారణమైనవి మరియు చాలా వేగంగా వ్యాధికారక బిందువుల (droplet) ద్వారా ఒక  వ్యక్తి నుండి  మరొక వ్యక్తికి వ్యాపిస్తాయి. సాధారణ ఉదాహరణలు జలుబు, సైనసైటిస్, మరియు ఇన్ఫ్లుఎంజా వైరస్ కలిగించే ఫ్లూ ఇన్ఫెక్షన్ వంటివి. వీటిలో, ఫ్లూ అత్యంత తీవ్రమైన కారణం.
    • దిగువ శ్వాసకోశ మార్గ సంక్రమణలు: దిగువ శ్వాసకోశ మార్గ సంక్రమణలు శ్వాసమార్గాల మీద మరియు అల్వియోలీ (alveoli) అని పిలిచే ఊపిరితిత్తుల కణజాలంపై ప్రభావం చూపుతాయి. ఈ అంటువ్యాధులకు తగిన సమయంలో చికిత్స చెయ్యకపోతే అవి బాగా ముదిరి ఊపిరితిత్తులకు నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణ ఉదాహరణలు న్యుమోనియా, బ్రోన్కైటిస్, మరియు బ్రోన్కియాక్టిసిస్. క్షయవ్యాధి ప్రాణాంతకమైనది కాని ఇది ఒక సాధారణ దిగువ శ్వాసకోశ మార్గపు సంక్రమణ. ఫ్లూ ఎగువ మరియు దిగువ శ్వాసకోశ మార్గలు రెండింటినీ ప్రభావితం చేయవచ్చు మరియు ఇది దగ్గుకు ఒక సాధారణ కారణం.
  • హృదయ సంబంధిత కారణాలు
    గుండె వైఫల్యం: తగినంత రక్తం సరఫరా చెయ్యడంలో గుండె సామర్ధ్యత తగ్గిపోతే దానిని గుండె వైఫల్యం అని పిలుస్తారు. అనేక దీర్ఘకాలిక గుండె వ్యాధులు గుండె వైఫల్యానికి దారితీస్తాయి. గుండెలో అధిక రక్తం చేరిపోవడం వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పెరుగిపోతుంది, అది కూడా దగ్గుకు కారణమవుతుంది, ప్రత్యేకంగా రాత్రి సమయంలో పడుతున్నప్పుడు ఇది జరుగుతుంది.
  • అంటువ్యాధులు కాని కారణాలు
    • అలెర్జీ పరిస్థితులు: విషపూరిత రసాయన పొగలను పీల్చడం వలన ముక్కు మరియు శ్వాసనాళాలలో అలెర్జీ ప్రతిచర్యలు కలుగుతాయి, ఇవి అలెర్జీక్ రినైటిస్ మరియు దగ్గుకు దారి తీస్తాయి. పుప్పొడి, ధూళి, పర్యావరణ కాలుష్య కారకాలు లేదా జంతువుల బొచ్చు వంటి సాధారణం అలెర్జీక్ కారకాలకు అలెర్జీ కలిగి ఉండడం కూడా దగ్గును ప్రేరేపిస్తుంది. దీనిని గవత జ్వరం (hay fever) అని కూడా పిలుస్తారు.
    • ఆస్త్మా (ఉబ్బసం): ఆస్త్మా ఒక తీవ్రమైన అలెర్జీ మరియు ఊపిరితిత్తుల యొక్క శ్వాసమార్గాల వాపు, ఇది దగ్గు, శ్వాసలో గురక శబ్దం మరియు శ్వాస అందకపోవడం వంటి మూడు లక్షణాలను కలిగిస్తుంది. వ్యాయామం చెయ్యడం, చల్లని వాతావరణం, పుప్పొడి, ధూళి, కొన్ని రసాయనాలు, రంగులు మరియు మొదలైనవి ఉబ్బసాన్ని కలిగించే సాధారణ ప్రేరేపకాలు.
    • క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD): ఇది సాధారణంగా ధూమపానం చేసేవారిలో సంభవిస్తుంది. దీర్ఘకాలిక నిరంతర దగ్గుగా ఇది గమనించబడుతుంది మరియు శారీరక శ్రమ చేసేటప్పుడు ఇది ఇంకా ఎక్కువవుతుంది. ఊపిరితిత్తుల కణజాల వాపు దీర్ఘకాలిక దగ్గుకు, కఫానికి మరియు శ్వాస అందకపోవడానికి దారితీస్తుంది.
    • ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం: ఊపిరితిత్తుల ఆర్టరీలలో రక్తం గడ్డకట్టడాన్ని పల్మోనరీ ఎంబోలిజం అని కూడా పిలుస్తారు, ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి. ఇది దగ్గుతో పాటు ఆకస్మికమైన మరియు తీవ్రమైన శ్వాస లోపానికి దారితీస్తుంది. ఈ రక్త గడ్డలు కాళ్ళ నరముల నుండి ఊపిరితిత్తుల వరకు ప్రయాణించగలవు.
    • ఊపిరితిత్తులు ముడుచుకుపోవుట: ఊపిరితిత్తుల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు ముడుచుకుపోతే, దానిని న్యుమోథొరాక్స్ అని అంటారు. ఊపిరితిత్తులలో ఏవైనా భాగాలలో గాలి బయటకుపోయి ద్రవం చేరినప్పుడు ఇది సంభవిస్తుంది. ఛాతీకి గాయం కలగడం లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ వంటి జన్యుసంబంధ వ్యాధులు, న్యుమోథొరాక్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఎంఫిసెమాతో బాధపడుతున్న ధుమపానం చేసేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది
    • నేసల్ డ్రిప్: నిరంతరంగా శ్లేష్మం చుక్కలు చుక్కలుగా (dribbling) గొంతులోకి పడడం అనేది దగ్గుకు దారితీస్తుంది, ముఖ్యంగా పడుకుని ఉన్నప్పుడు ఇది కలుగుతుంది. సాధారణంగా ఎగువ శ్వాసకోశ మార్గ సంక్రమణ లేదా అలెర్జీ రినైటిస్ విషయంలో ఇది సంభవిస్తుంది.
    • ఊపిరితిత్తుల క్యాన్సర్: ఏవైనా ఊపిరితిత్తుల కణజాలంలో కణాలు అనియంత్రితంగా పెరగడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీస్తుంది, ఇది దగ్గుకు ఒక సాధారణ కారణం. మెటాస్టాసిస్ లేదా ఇతర అవయవాలు నుండి ఊపిరితిత్తులకు కణితులు వ్యాపించడం కూడా దగ్గుకు దారితీస్తుంది. ఇటువంటి దగ్గు రక్తాన్ని కూడా కలిగి ఉండవచ్చు.
  • జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కారణాలు
    గ్యాస్ట్రో-ఒసిఫేగల్ రిఫ్లక్స్ డిసీస్ (జి.ఇ.ఆర్.డి): కడుపులో తయారయ్యే యాసిడ్ అన్న వాహికలోకి పైకి ప్రయాణించడం కూడా దగ్గుకు ఒక సాధారణ కారణం. ఇది జి.ఇ.ఆర్.డి అని పిలవబడే పరిస్థితి.
  • ఇతర కారణాలు
    మందులు: అధిక రక్తపోటుకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ (ACE-I) వంటి కొన్ని మందులు కూడా పొడి దగ్గును కలిగిస్తాయి.

ప్రమాద కారకాలు

దగ్గును కలిగించే కొన్ని ప్రమాద కారకాలు ఈ కింది విధంగా ఉంటాయి:

ఈ క్రింద ఇవ్వబడిన కొన్ని అంతర్గత కారణాలు దగ్గు కలిగే ప్రమాదాన్ని పెంచుతాయి:

దగ్గు కలిగే ప్రమాదాన్ని పెంచే కొన్ని బాహ్య (External) కారణాలు:

  • ధూమపానం
  • పర్యావరణ కాలుష్యా కారకాలు మరియు ఆస్బెస్టాస్, బొగ్గు, సిలికా వంటి ఇరిటేటెంట్లు (చికాకు కలిగించే పదార్దాలు)
  • సాంక్రామిక (వ్యాపించే) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో సన్నిహితంగా ఉండడం.

దగ్గు నివారణ - Prevention of cough in Telugu

దగ్గును నివారించడానికి, అంటువ్యాధులు మరియు ప్రతికూలతల (ఎలర్జెన్) నుండి తమని తాము రక్షించుకోవడానికి తగినన్ని రక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, వాటిని ఈ క్రింది విధంగా  చేయవచ్చు:

  • బయటికి వెళ్ళినప్పుడు పర్యావరణ కాలుష్యా కారకాలు మరియు ఎలర్జెన్ల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి మాస్క్ ను ధరించడం మంచిది. ఇది శ్వాసకోశ మార్గ అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం నుండి మిమ్మల్ని మరింతగా కాపాడుతుంది. పునరావృత దగ్గు వల్ల బాధపడుతుంటే లేదా ఊపిరితిత్తుల సంక్రమణలకు తరచూ గురవుతున్నట్లయితే మాస్క్ వంటి రక్షిత పరికరాలను ఉపయోగించడం చాలా ముఖ్యం.
  • ఏవైనా తెలిసిన ఎలర్జెన్లు ఉంటే వాటిని నివారించాలి మరియు పర్యావరణ ప్రేరేపకాల (ట్రిగ్గర్ల) నుండి దూరంగా ఉండాలి.
  • సాంక్రమిత (వ్యాపించే) అంటువ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దూరంగా ఉండడం మరియు చేతులను తరచుగా కడుక్కోవడం కూడా సంక్రమణ నివారణలో సహాయపడతాయి.
  • చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచాలి మరియు ఉపయోగించిన టిష్యూలను జాగ్రత్తగా పారవేయాల్సి ఉంటుంది.
  • దగ్గు నివారించగల మరో మార్గం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. రోగనిరోధకత శక్తిని పెంచే ఆహారాలు, విటమిన్ సి అధికంగా ఆహార పదార్ధాలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి.
  • టీకా వేయించుకోవడం (వాక్సినేషన్) రోగనిరోధక శక్తిని పెంచే మరొక ముఖ్యమైన చర్య, ఇది భవిష్యత్తులో సంభవించే అంటువ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి, పిల్లలకు పెర్ట్యూసిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నివారణ కోసం టీకాలు వేయించాలి.
Nasal Congestion
₹199  ₹249  20% OFF
BUY NOW

దగ్గు నిర్ధారణ - Diagnosis of cough in Telugu

వైద్యులు రోగి వృత్తి, జీవనశైలి, మునుపటి ఆరోగ్య చరిత్ర, మరియు ప్రస్తుత లక్షణాల ఆధారంగా దగ్గును నిర్ధారిస్తారు. దాని తరువాత ఒక స్టెతస్కోప్ సహాయంతో ఛాతీ పరీక్ష చేస్తారు, ఖచ్చితమైన కారణం గుర్తించడానికి, నిర్ధారణా పరీక్షలు నిర్వహిస్తారు.

వైద్యులు ఈ క్రింది వాటిలో కొన్ని పరీక్షలను సిఫారసు చేయవచ్చు:

ప్రయోగశాల పరీక్షలు

  • పూర్తి రక్త గణన (Complete blood count)
  • సూక్ష్మ జీవుల తనిఖీ కోసం కఫ సాగు మరియు మైక్రోస్కోపిక్ పరీక్ష
  • నిర్దిష్ట అంటువ్యాధుల తనిఖీ కోసం నిర్దిష్ట పరీక్షలు
  • గొంతు స్వాబు
  • స్పైరోమెట్రీ - ఇది ఊపిరితిత్తుల పనితీరు మరియు శ్వాస సామర్థ్యాన్ని పరిశీలించడానికి చేసే ఒక పరీక్ష

ఇమేజింగ్ అధ్యయనాలు

  • ఛాతీ ఎక్స్-రే
  • ఛాతీ యొక్క సిటి (CT) స్కాన్
  • బ్రోన్కోస్కోపీ - కెమెరా-అమర్చిన ఒక సన్నని గొట్టాన్ని ఊపిరితిత్తుల వాయుమార్గాల (బ్రోంకి) లోకి పంపించి దగ్గు కారణాన్ని గుర్తించే ఒక రకమైన పరీక్ష. శరీరం నుండి బయటి పదార్దాన్ని తొలగించడం ద్వారా దగ్గుకు చికిత్స చెయ్యడంలో కూడా కొన్నిసార్లు దీనిని ఉపయోగిస్తారు. బ్రోన్కోస్కోపీని మరింత అంచనా కోసం కణజాల నమూనాను సేకరించేందుకు కూడా ఉపయోగించవచ్చు, దానిని బయోప్సీ అని పిలుస్తారు.

దగ్గు చికిత్స - Cough treatment in Telugu

దగ్గు యొక్క చికిత్సా విధానాలు కారణం ఆధారపడి ఉంటాయి. ఈ క్రింద దగ్గు యొక్క చికిత్సా విధానాల జాబితా ఇవ్వబడింది:

  • యాంటిబయోటిక్స్ మరియు యాంటీ ఫంగల్స్ ను శ్వాస మార్గపు అంటువ్యాధులు చికిత్సకు ఉపయోగిస్తారు.
  • శ్వాస మార్గాలలో పేరుకుపోయిన కఫాన్ని తొలగించేందుకు ఎక్సపెక్టోరెంట్లు (కఫాన్ని తగ్గించే మందులు) సూచించబడవచ్చు. యాంటీ-టస్సివ్లు (Anti-tussives) కూడా సాధారణంగా సూచించబడతాయి.
  • దగ్గు యొక్క అలెర్జీ కారణాలకు చికిత్స అందించడానికి యాంటిహిస్టామైన్లు మరియు డీకన్గెస్టాంట్లు (decongestants) ఉపయోగిస్తారు. ఏదేమైనా, అలెర్జీ పరిస్థితుల చికిత్సకు ఎలర్జెన్లను నివారించడం ఒక ప్రధాన మార్గం.
  • బ్రోన్కో డిలేటర్లు అని పిలవబడే మందులు వాయుమార్గాలను విస్తరించడంలో సహాయపడతాయి, వీటిని ఉబ్బసం చికిత్సలో ఉపయోగిస్తారు. ఇవి దగ్గు సంబంధిత లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
  • ప్రెడ్నిసోన్ (Prednisone) వంటి స్టెరాయిడ్స్ ఆస్తమా మరియు సిఓపిడి ల యొక్క తీవ్రమైన ఎపిసోడ్ల చికిత్సకు ఉపయోగించవచ్చు.
  • జి.ఇ.ఆర్.డి దగ్గుకు కారణమైనప్పుడు ప్రొటీన్ పంప్ ఇన్హిబిటర్లు మరియు H2- రిసెప్టర్ బ్లాకర్లను ఉపయోగిస్తారు.
  • మందుల వలన దగ్గు ఏర్పడుతుంటే మందులను మార్చడం లేదా మోతాదును తగ్గించడం చేస్తారు.
  • ఊపిరితిత్తులు ముడుచుకుపోవడం లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టినప్పుడు, రక్తాన్ని పలుచబార్చే మందులు, ఆక్సిజన్ మరియు ఇతర అత్యవసర చికిత్సలు అవసరమవుతాయి. చెస్ట్ డ్రైనేజ్ ట్యూబ్ ను ముడుచుకుపోయిన ఊపిరితిత్తిని సరిచేయడానికి మరియు ఛాతీ క్యావిటీలో ఏదైనా ద్రవం ఉండిపోతే దానిని తొలగించడానికి ఉపయోగిస్తారు.

దగ్గును నిర్వహించడానికి చిట్కాలు

  • దగ్గుతున్నపుడు లేదా తుమ్ముతున్నపుడు ముక్కు మరియు నోటికి టిష్యూ పేపర్ లేదా ఒక రుమాలును అడ్డుపెట్టుకోండి. వెంటనే టిష్యూను పారవేయాలి. ఏమి అందుబాటులో లేని సందర్భంలో, మీ మోచేయి వొంకర దగ్గర కానీ లేదా జబ్బ దగ్గర దగ్గాలి అంతేకాని చేతి మీద దగ్గకూడదు.
  • పని చేసే ప్రదేశంలో లేదా ఇంటిలో మీరు తాకిన ఉపరితలాలను ఎల్లప్పుడూ శుభ్రపరచాలి.
  • మీ ముక్కు, కళ్ళు మరియు నోటిని తాకిన తరువాత వేడి నీరు మరియు సబ్బుతో కనీసం 15 నుండి 20 సెకన్ల వరకు మీ చేతులను కడగాలి. ఆల్కహాల్ ఆధారిత లోషన్లను కూడా ఉపయోగించవచ్చు.
  • ఇప్పటికే ఉన్న దగ్గు మరింత తీవ్రతరం అవ్వకుండా ఉండడానికి ధూమపానం అలవాటు ఉంటే దానిని విడిచిపెట్టడం మంచిది. పరోక్ష ధూమపానం వలన వచ్చే పొగను పీల్చడాన్ని నివారించాలి.
  • దగ్గు మరియు ముక్కు దిబ్బేడను తగ్గించడానికి ఆవిరి పీల్చడం లేదా వేడి నీటి స్నానం చేయవచ్చు.
  • చల్లని నీళ్ల కంటే వెచ్చని నీటిని తాగడం వలన జలుబు మరియు గొంతు మంటను నిర్వహించవచ్చు.
  • గట్టిగా ఉండే క్యాండీలు లేదా లోజెన్జస్ (మందు బిళ్ళలు) వంటి పీల్చడం అనేది లాలాజల ఉత్పత్తిని పెంచడం ద్వారా గొంతు మంటకు మరియు పొడి దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది. మూడు సంవత్సరాల వయస్సు లేదా అంతకన్నా తక్కువ వయస్సు పిల్లలకు ఇవి ఇవ్వరాదు ఎందుకంటే పొరబరాడం వంటి ప్రమాదాలను కలిగిస్తాయి.
  • అల్లం టీ లేదా నిమ్మ టీ వంటి వెచ్చని టీలు కూడా దగ్గును తగ్గించడంలో సహాయపడతాయి.
  • తేనె దగ్గు యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది మరియు ఒక గొంతు వాపుకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇది ఇవ్వరాదు ఎందుకంటే కొన్నిసార్లు  ఇది బోట్యూలిజం వంటి తీవ్రమైన సంక్రమణలను కలిగించవచ్చు.

దగ్గు రోగసూచన మరియు సమస్యలు - Cough prognosis & complications in Telugu

రోగసూచన

దగ్గు సాధారణంగా ఏ తీవ్రమైన వ్యాధి యొక్క సంకేతం కాదు. కానీ, కొన్నిసార్లు, స్వల్పకాలిక దగ్గు దీర్ఘకాలిక దగ్గుకు ఒక మొదటి సంకేతం కావచ్చు. ఇంకా అరుదైన సందర్భాల్లో, నిరంతర దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయవ్యాధి లేదా గుండె వైఫల్యాల యొక్క లక్షణం కావచ్చు. పిల్లలలో, నిరంతర దగ్గు సిస్టిక్ ఫైబ్రోసిస్ కు సంకేతం కావచ్చు, ఇది ఒక తీవ్రమైన దీర్ఘకాలీక సంక్రమణం. చాలా మంది వ్యక్తులలో, మూడు వారాలలోనే దగ్గు తగ్గిపోతుంది; అందువలన, వారికి పెద్దగా చికిత్స అవసరం ఉండదు. దగ్గు గనుక కొనసాగితే, వైద్యులను సంప్రదించడం మంచిది, వారు దగ్గు యొక్క మూల కారణాన్ని కనుగొని దానికి చికిత్స చేస్తారు.

సమస్యలు

దగ్గుతున్న సమయంలో ఏర్పడిన ఒత్తిడి మరియు బలము వంటి వాటివలన దగ్గు యొక్క సమస్యలు ఉత్పన్నమౌతాయి. దగ్గు యొక్క కొన్ని ప్రతికూల సమస్యలు ఈ విధంగా ఉంటాయి:

  • దగ్గు వలన సహజంగా ఏర్పడే లక్షణాలు: చెమటలు, ఆకలిలేమి, అలసట.
  • చర్మం: ఏవైన శస్త్రచికిత్సా గాయాలు ఉంటే అవి కదిలిపోతాయి.
  • మస్క్యులోస్కెలెటల్ (Musculoskeletal) లక్షణాలు: పక్కటెముక ఫ్రాక్చర్లు, డయాఫ్రమ్ చీలిక మొదలైనవి.
  • గుండె సంభందిత లక్షణాలు: ఆర్టరీలలో తక్కువ రక్తపోటు, హృదయ స్పందన రేటుతగ్గిపోవడం లేదా  హృదయ స్పందన రేటు పెరిగిపోవడం.
  • నరాలకు సంబంధించినవి: తలనొప్పి, మైకము, మూర్చ.

ప్రభావాలు శ్వాసకోశమార్గము, హృదయనాళ వ్యవస్థ, జీర్ణాశయము, మరియు కళ్ళలో కూడా కనిపిస్తాయి. తీవ్రమైన దగ్గు మానసిక ప్రభావాలను కూడా కలిగిస్తుంది మరియు వ్యక్తి యొక్క జీవన నాణ్యతపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. నిరంతర పొడి దగ్గు ఈ క్రింది సమస్యలను కలిగిస్తుంది:

  • గర్భిణీ స్త్రీలలో మూత్రం ఆపుకొనలేని సమస్య ఏర్పడుతుంది.
  • నిద్రకు అంతరాయం కలగడం .
  • దగ్గు గొంతులో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది అది కొన్ని సార్లు వాంతులను కూడా  కలిగిస్తుంది.
  • తలనొప్పి.
Cough Relief
₹716  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. National Health Service [Internet] NHS inform; Scottish Government; Cough
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cough
  3. P.A. Mahesh, B.S. Jayaraj, A.K. Prabhakar, S.K. Chaya, R. Vijayasimha. Prevalence of chronic cough, chronic phlegm & associated factors in Mysore, Karnataka, India. ndian J Med Res. 2011 Jul; 134(1): 91–100.PMID: 21808140
  4. Chest Foundation [Internet] American College of Chest Physicians, USA; Cough.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cough
  6. National Institutes of Health; [Internet]. U.S. Department of Health & Human Services; Marfan syndrome.
  7. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pertussis (Whooping Cough)
  8. American Pregnancy Association. [Internet]; Cough And Cold During Pregnancy.
  9. National Health Service [Internet]. UK; Cough.
  10. Irwin RS. Complications of cough: ACCP evidence-based clinical practice guidelines. Chest. 2006 Jan;129(1 Suppl):54S-58S. doi: 10.1378/chest.129.1_suppl.54S. PMID: 16428692
  11. Richard S. Irwin. Complications of Cough. American College of Chest Physicians, US [Internet]

దగ్గు కొరకు మందులు

Medicines listed below are available for దగ్గు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.