ఎపిడిడిమిటిస్ అంటేఏమిటి?
ఎపిడిడిమిటిస్ అంటే వృషణముకు వెనుక భాగమున అంటిపెట్టుకుని ఉండే ప్రాంతం (ఎపిడిడిమిస్,epididymis) యొక్క వాపు, ఇది వృషణాల నుండి పురుషాంగానికి వీర్యకణాలు తీసుకు వెళ్లే ఒక గొట్టం వంటిది. ఎపిడిడిమిటిస్ సమస్యలో ఎపిడిడిమిస్ రేగిపోతుంది లేదా వాచిపోతుంది. ఈ సమస్య ఏ వయసులో అయినా ఏర్పడవచ్చు, కానీ 14 మరియు 35 సంవత్సరాల మధ్య వయసులో సర్వసాధారణంగా సంభవిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా కలిగే లక్షణాలు:
- వృషణాల ప్రాంతంలో నొప్పి
- బీజకోశము/వృషణ తిత్తి (scrotum) యొక్క వాపు మరియు ఎర్రదనం
- జ్వరం మరియు చలి
- బాధాకరమైన మూత్రవిసర్జన
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
అత్యంత సాధారణ కారణం సి. ట్రకోమెటిస్ (C. trachomatis) లేదా ఎన్. గోనేరియే (N. gonorrhoeae) వలన సంక్రమణం (ఇన్ఫెక్షన్), ఇది ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎపిడిడిమిటిస్ కు కారణమయ్యే ఇతర అంటువ్యాధులు గవదబిళ్ళలు (mumps, ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్) మరియు క్షయవ్యాధి (tuberculosis, ఒక రకమైన బ్యాక్టీరియల్ సంక్రమణ). పిల్లలు, వృద్ధులు మరియు యానల్ సంపర్కంలో పాల్గొనే వ్యక్తులలో సాధారణంగా ఇది ఇ. కోలి (E. coli) బాక్టీరియా వలన సంభవిస్తుంది. కొన్ని మందులు కూడా ఎపిడిడిమిటిస్ కు కారణం కావచ్చు. భారీ బరువులు ఎత్తినప్పుడు అప్పుడప్పుడు మూత్రం వెనుకకు ప్రవహించిన కారణంగా కూడా ఎపిడిడిమిటిస్ సంభవించవచ్చు. దీనికి చికిత్స చేయకపోతే, వృషణాలలో చీము పెరిగేటట్లు చేస్తుంది. అలాగే పురుషులు సంతానోత్పత్తి సమస్యలకు కూడా దారితీస్తుంది.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఏదైన సున్నితత్వం లేదా గడ్డ యొక్క తనిఖీ కోసం భౌతిక పరీక్ష చేయబడుతుంది. ఏదైన బాక్టీరియల్ సంక్రమణను గుర్తించడానికి మూత్ర పరీక్షను చేయవచ్చు. మరింతగా బీజకోశ ప్రాంతాన్ని పరిశీలించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షను ఆదేశించవచ్చు.
ఇతర పరీక్షలు వీటిని కలిగి ఉండవచ్చు:
- పూర్తి రక్త గణన (Complete blood count)
- క్లమిడియా మరియు గోనేరియాల సంక్రమణ యొక్క పరిశోధనకు రక్త పరీక్షలు
చికిత్సలో ప్రధానంగా సంక్రమణ (ఇన్ఫెక్షన్) కలిగించే బాక్టీరియా యొక్క రకం ఆధారంగా యాంటీబయాటిక్స్ ఉపయోగం అనేది ఉంటుంది.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- తగినంత విశ్రాంతి తీసుకోవాలి
- అసౌకర్యం నుండి ఉపశమనం పొందడానికి బీజకోశము పైకి ఉండేలా పడుకోవాలి
- నొప్పి ఉన్న ప్రాంతంలో తట్టుకునేంత వరకు ఐస్ (చల్లని నీళ్ల ) కాపడాన్ని పెట్టాలి
- ద్రవ పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి
- నొప్పినివారణ మందులు నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి
నివారణ చర్యలు:
- సంభోగం సమయంలో కండోమ్లను ఉపయోగించాలి
- సమస్య తగ్గేంత వరకు భారీ బరువులను ఎత్తడం పూర్తిగా మానివేయాలి
- ఎక్కువ సమయం పాటు కూర్చొని ఉండరాదు
ఆకస్మికంగా తీవ్ర నొప్పి సంభవించినట్లయితే, అప్పుడు అది వైద్య అత్యవసరమని గమనించి వెంటనే వైద్యపరమైన శ్రద్ధగా తీసుకోవాలి.