హెచ్. పైలోరి అంటే ఏమిటి?
హెచ్. పైలోరి (హెలికోబెక్టర్ పైలోరి [Helicobacter pylori]) అనేది మన శరీరంలోకి ప్రవేశించి కడుపులో నివాసాన్ని ఏర్పరచుకునే ఒక బాక్టీరియా. ఇది తరచూ కడుపులో ఒక సహభోజి (commensal) గా ఉంటుంది (కడుపులో ఉంటుంది కానీ ఏ సమస్య/వ్యాధిని కలిగించదు); కానీ కొంత మందిలో, దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, అది బాగా పెరుగి, కడుపులో పుండ్లను కలిగిస్తుంది. అది సాధారణంగా జిఇఆర్డి (GERD, గ్యాస్ట్రో-ఓసోఫాగల్ రిఫ్లక్స్ వ్యాధి) అని పిలవబడే వ్యాధిని కలిగిస్తుంది, జిఇఆర్డి కి యాంటీబయాటిక్స్ తో సులభంగా చికిత్స చేయవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హెచ్. పైలోరీ కడుపులోకి ప్రవేశించినప్పుడు, అది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు కడుపు లోపలి పొరకు కూడా హాని కలిగించి కడుపులో పుండ్లకు దారితీస్తుంది (కొన్నిసార్లు ఇది పలు గ్యాస్ట్రిక్ అల్సర్లకు కారణమవుతుంది). పుండ్ల యొక్క లక్షణాలు:
- ఉదరం పై భాగంలో నొప్పి (మరింత సమాచారం: కడుపు నొప్పి కారణాలు)
- కడుపు నొప్పి, తినేటప్పుడు ఎక్కువ అవుతుంది మరియు భోజనం తర్వాత కొన్ని గంటలలో తగ్గుతుంది; అలాగే చాలా సమయం పాటు ఏమి తిననపుడు (ఉపవాసం) లేదా భోజనం చెయ్యడం ఆలస్యం అయినప్పుడు కూడా పెరుగుతుంది
- వికారం
- వాంతులు (కొన్నిసార్లు వాంతులలో రక్తం కూడా పడుతుంది)
- కడుపు ఉబ్బరం
- త్రేన్పులు
- బరువు తగ్గుదల మరియు రక్తహీనత
- మలం నల్ల రంగులో ఉంటుంది
దీని ప్రధాన కారణం ఏమిటి?
హెచ్. పైలోరీ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో తెలియదు కానీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇది కడుపు లోపలి గోడల మీద పుండ్లు ఏర్పడడానికి కారణమవుతుంది. హెచ్. పైలోరీ చాలా మందిలో సహజంగానే వారి కడుపులో ఉంటుంది, కానీ కొన్ని ప్రమాద కారకాలు ఈ బ్యాక్టీరియా కడుపులో పుండ్లను కలిగించే అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తాయి.
ప్రమాద కారకాలు:
- హెచ్. పైలోరి సంక్రమిత వ్యక్తితో ఎక్కువగా కలిసి ఉండడం
- నీరు పరిశుభ్రంగా లేకపోవడం (అలాంటి నీటిని తాగడం వలన ఈ అంటువ్యాధి సంక్రమించవచ్చు)
- అధిక జన సాంద్రత ఉన్న ప్రాంతాల్లో నివసించడం
- వ్యక్తిగత పరిశుభ్రత తక్కువగా ఉన్న పరిస్థితులలో నివసించడం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం మరియు క్షుణ్ణమైన వైద్య పరీక్షలతో గ్యాస్ట్రో-ఇసోఫాజీయల్ రెఫ్లక్స్ వ్యాధి (GERD) నిర్ధారణను చేస్తారు. హెచ్. పైలోరీ సంక్రమణను/ఇన్ఫెక్షన్ను నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు తప్పనిసరిగా చెయ్యాలి. ఆ పరీక్షలు:
- పూర్తి రక్త గణన (CBC) వంటి రక్త పరీక్షలతో పాటు మల పరీక్ష
- బ్రీత్ యూరియా పరీక్ష (Breath urea test),
- ఎగువ జీర్ణవ్యవస్థ ఎండోస్కోపీ (Upper digestive tract endoscopy)
సాధారణంగా హెచ్ పైలోరీ సంక్రమణకు నోటి ద్వారా తీసుకునే మందులతో చికిత్స చేయవచ్చు, వాటిలో వివిధ ఔషధాల కలయిక చికిత్స (combination therapy) ఉంటుంది:
- యాంటీబయాటిక్స్ - అమోక్సిసిలిన్ (amoxicillin), మెట్రోనిడజోల్ (metronidazole), టినిడజోల్ (tinidazole), క్లారిథ్రోమైసిన్ (clarithromycin) వంటి మందులు బాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి
- ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు (Proton pump inhibitors) మరియు హిస్టామిన్ బ్లాకర్స్ (histamine blockers) - ఈ మందులు కడుపులో ఆమ్ల (యాసిడ్) స్థాయిని తగ్గించడంలో మరియు పుండ్ల వైద్యంలో సహాయపడతాయి
- బిస్మత్ సబ్సైసిక్లేట్ (Bismuth subsalicyclate) - ఇది పుండుపై ఒక పొరను ఏర్పరచడం ద్వారా అంతర్గత లైనింగ్ను రక్షిస్తుంది