హెపాటిక్ ఎన్సెఫలోపతీ అంటే ఏమిటి?
మానసిక గందరగోళం మరియు జ్ఞాపకశక్తి నష్టాన్నికలిగించే మెదడులోని గందరగోళాన్నే (లేదా మెదడు పనితీరు క్షీణతనే) “ఎన్సెఫలోపతి” గా సూచిస్తారు. హెపాటిక్ ఎన్సెఫలోపతిలో, దీర్ఘకాలిక కాలేయ వ్యాధి లేదా కాలేయ వైఫల్యం ఫలితంగా మెదడు యొక్క పనితీరులో క్షీణత కల్గుతుంది. కాలేయ సిర్రోసిస్ వ్యాధి కల్గిన వ్యక్తులలో హెపాటిక్ ఎన్సెఫలోపతి వ్యాధి కూడా సర్వసాధారణంగా గుర్తించబడుతుంది. (కాలేయ సిర్రోసిస్ అంటే దీర్ఘకాలిక కాలేయ హాని కలిగించే కాలేయపు మచ్చలు మరియు కాలేయ పనితీరులో గణనీయమైన క్షీణత).
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హెపాటిక్ ఎన్సెఫలోపతి యొక్క సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు:
- జ్ఞాపకశక్తి నష్టం
- ఏకాగ్రత సమస్యలు
- పెరిగిన చిరాకు
- గందరగోళం
- సమన్వయ సమస్యలు
- తగ్గిన చురుకుదనం
- వివరించలేని మానసిక కల్లోలం
- సమయం మరియు స్థలాన్నిసరిగ్గా లెక్క కట్టలేకపోవడం
పైన పేర్కొన్న వ్యాధిలక్షణాలు ఇతర నరాలకు సంబంధించిన లక్షణాలతో కూడా కూడుకుని ఉంటాయి:
- మూర్చ
- మాట్లాడడంలో ఇబ్బందులు (మాటల్లో అస్పష్టత)
- వణుకుడు కల్గిఉండడం
- అసంకల్పిత పోటు (శూల)
- అసంకల్పిత కంటి కదలికలు
- కండరాల బలహీనత
కాలేయం తీవ్రంగా దెబ్బతింటున్నందున, కాలేయ వ్యాధికి సంబంధించిన ఇతర వ్యాధి లక్షణాలను కూడా హెపాటిక్ ఎన్సెఫలోపతి కల్గిన వ్యక్తి అనుభవిస్తారు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
హెపాటిక్ ఎన్సెఫలోపతి యొక్క ప్రధాన కారణం దీర్ఘకాలిక కాలేయ వైఫల్యం. ఇది ఎక్కువగా కాలేయ సిర్రోసిస్ లేదా హెపటైటిస్ బి లేదా సి సంక్రమణ చరిత్ర కలిగిన వ్యక్తులలో లేదా దీర్ఘకాలిక మద్యపాన వ్యసనం కల్గినవాళ్లలో ఎక్కువగా గుర్తించబడుతుంది ఈ సమస్యల కారణంగా, శరీరం నుండి విషాన్ని తొలగించే పనితీరును కాలేయం సరిగ్గా చేయలేకపోతుంది. రక్తంలో ఈ విషపదార్ధాలు పేరుకుపోవడం వలన మెదడు పనితీరును ప్రతికూలంగా దెబ్బ తీయడం జరిగి, వ్యక్తిమానసిక పనితీరులో మార్పుకు దారితీస్తుంది. పై సమస్యలు ఇంకా నరాలకు మరియు మెదడుకు సంబంధించిన వ్యాధి లక్షణాలకు కూడా కారణమవుతాయి.
హెపాటిక్ ఎన్సెఫలోపతి అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి కాదు.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
హెపాటిక్ ఎన్సెఫలోపతిని నిర్ధారించడానికి మరియు ఇతర కారణాలన తోసిపుచ్చడానికి వైద్యుడు రోగి యొక్క లక్షణాలు మరియు వైద్య చరిత్ర గురించి అడిగి విచారణ చేసి తెలుసుకుంటాడు. ఇతర నిర్ధారణచర్యల్లో కింది పరీక్షలు ఉన్నాయి:
- రక్త పరీక్షలు: రక్తపరీక్షల ద్వారా విషాన్ని గుర్తించడం, మరియు కాలేయ ఆరోగ్య స్థితిని అంచనా వేయడం.
- స్పైనల్ టాప్ పరీక్ష (కటి పంక్చర్): ఈ పరీక్షను సెరెబ్రోస్పైనల్ ద్రవానికి బాక్టీరియా మరియు వైరస్-కారక సంక్రమణల్ని గుర్తించడం కోసం చేస్తారు. (సెరెబ్రోస్పైనల్ ద్రవం-CSF అంటే మెదడు మరియు వెన్నుపామును ఆవరించియుండే ద్రవము)
- మెదడు అనాటమీని అంచనా వేసేందుకు కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్ వంటి ఇమేజింగ్ అధ్యయనాలు.
హెపాటిక్ ఎన్సెఫలోపతి చికిత్సలో ఔషధాలసేవనమే గాక ఆహార మార్పులను కూడా కలిగి ఉంటుంది.
అసంకల్పిత కండర కదలికలను తగ్గించడానికి మరియు రక్తంలో విషపదార్థాల (టాక్సిన్లు) స్థాయిల్ని అణచివేయడానికి మందులు సూచించబడతాయి. హెపాటిక్ ఎన్సెఫలోపతి వ్యాధి చికిత్స ద్వారా నయమవుతుంది మరియు సరైన వైద్య సలహాల ద్వారా వ్యాధిని తిప్పికొట్టవచ్చు. అయినప్పటికీ, హెపాటిక్ ఎన్సెఫలోపతి దీర్ఘకాలిక దెబ్బతిన్న కాలేయవ్యాధి ఉన్న వ్యక్తులలోనే ప్రధానంగా కనబడుతున్నందున, ఈ పరిస్థితి మళ్లీ రావచ్చు. ఇలా ఈ వ్యాధి మళ్ళీ మళ్ళీ దాపురించడాన్ని, డాక్టరు రోగనిరోధక చికిత్సను (prophylactic treatment) సూచించవచ్చు.