విటమిన్ డి లోపం అంటే ఏమిటి?
విటమిన్ డి లోపం, దీనిని హైపోవిటామినోసిస్ డి (hypovitaminosis D) అని కూడా పిలుస్తారు, దీనిలో శరీరంలో విటమిన్ డి స్థాయిల శాతం తగ్గిపోతాయి. విటమిన్ డి కాల్షియం శోషణ (absorption)ను నియంత్రించే అత్యంత ముఖ్యమైన విటమిన్లలో ఒకటి మరియు పారాథైరాయిడ్ గ్రంధి యొక్క హార్మోన్ల విడుదలలో కూడా ఇది సహాయపడుతుంది. భారతదేశంలో, విటమిన్ డి లోపం యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉందని అంచనా వేయబడింది దాదాపు 70% -100% జనాభాలో ఇది ఉండవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చాలామంది వ్యక్తులలో ఎటువంటి లక్షణాలు ఉందనదువల్ల మొదటి దశలలో ఇది నిర్దారించబడదు. విటమిన్ డి లోపం యొక్క తీవ్రమైన సందర్భాలలో ఉండే లక్షణాలు:
- పిల్లలలో రికెట్స్
- పెద్దవాళ్ళలో ఆస్టియోమలేసియా
- కండరాల బలహీనత
- ఎముక నొప్పి
- సున్నితత్వం (తాకితేనే నొప్పి పుట్టడం)
- శరీర భంగిమను నిర్వహించడంలో సమస్య
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ డి ఆహారంలో చాలా తక్కువ వనరుల నుండి లభిస్తుంది మరియు సూర్యకాంతి ఈ విటమిన్ యొక్క ప్రధాన వనరు. సూర్యుడి యువి (UV) కిరణాలు చర్మంలో ఉండే క్రియారహిత (inactive) విటమిన్ డి క్రియాశీలక (active) విటమిన్ డి గా మార్చుతాయి. ఈ క్రియాశీలక విటమిన్ డి శరీరంలో కాల్షియంను నియంత్రించే విధిని నిర్వర్తించడానికి ముందు కాలేయం మరియు మూత్రపిండాల్లో ఇది మరింత ఉత్తేజితం/క్రియాశీలకం అవుతుంది.
ఈ విటమిన్ యొక్క లోపాన్ని ప్రేరేపించే అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని,
- విటమిన్ డి ను ఆహారం ద్వారా తీసుకోకపోవడం
- ఆహారంలో కొవ్వుల కొరత కారణంగా శరీరంలో తగినంతగా విటమిన్ డి శోషణ జరగకపోవడం
- సూర్య కాంతికి తగినంతగా బహిర్గతం కాకపోవడం
- విటమిన్ డి ప్రాసెస్ అయ్యే (processed) మూత్రపిండాలు లేదా కాలేయంలో వ్యాధుల కారణంగా విటమిన్ డిని క్రియాశీలక రోపంలోకి మార్చడంలో అసమతుల్యత ఏర్పడడం
- విటమిన్ డి దాని మార్పిడి (క్రియారహిత రూపం నుండి క్రియాశీలక రూపంలోకి) మరియు శోషణలో అడ్డంకులు ఏర్పరిచే కొన్ని మందుల ప్రతిచర్యలు
ఈ కారణాలు ఎముక సాంద్రతకు తగ్గిపోవడానికి దారితీస్తాయి, ఇది ఎముకలు పెళుసుగా మారడానికి కారణమవుతుంది మరియు ఫ్రాక్చర్లు త్వరగా సంభవిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రక్తంలో విటమిన్ డి స్థాయిలను అంచనా వేయడం ద్వారా విటమిన్ డి లోపాన్ని గుర్తించవచ్చు. దీనికి ముందుగా, వైద్యులు శారీరక పరీక్షను నిర్వహించి, ఆరోగ్య చరిత్రను గురించి తెలుసుకోవచ్చు. ఖనిజాలకు సంబంధించిన వివిధ పరీక్షలు ముఖ్యంగా కాల్షియం, ఫాస్పరస్ మరియు పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిల పరీక్షలు నిర్వహిస్తారు.
పెద్దలకు సిఫార్సు చేయబడిన విటమిన్ డి మోతాదు (recommended dietary intake,RDA) రోజుకు 15 mcgలు. విటమిన్ డి లోపాన్ని సరిచేయడానికి వివిధ సప్లీమెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సప్లీమెంట్లు రెండు రూపాల్లో అందుబాటులో ఉన్నాయి, అవి - విటమిన్ డి2 మరియు డి3 యొక్క ఓరల్ (నోటి ద్వారా) మరియు ఇంజెక్టబుల్ (శరీరంలోకి ఎక్కించేవి) రూపాలు. విటమిన్ డి లోపాన్ని నిర్వహించడం కోసం ఆహార మార్పులు చాలా ముఖ్యం. విటమిన్ డి యొక్క రోజువారీ అవసరాన్ని పొందేందుకు ఈ విటమిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఉదా. కాలేయం, గుడ్డు పచ్చసొన మరియు చీజ్. శరీరానికి తగినంత సూర్యరశ్మి అందించడానికి ఉదయం సమయంలో సూర్యకాంతిలో నడక లేదా ఏదైనా శారీరక శ్రమ చేయటం మంచిది. ఇది శరీరానికి తగినంత సూర్యరశ్మిని అందించటానికి సహాయపడుతుంది మరియు చర్మంలో ఉండే విటమిన్ డి క్రియశీలంగా మార్చగలదు. ఉదయం సమయంలో సూర్యరశ్మి చర్మం మీద తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది. ఆ విధంగా సూర్యరశ్మి, విటమిన్ డి లోపాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. సకాల నిర్ధారణతో విటమిన్ డి లోపాన్ని సులభంగా సరిచేయవచ్చు.