జ్ఞాన దంతం నొప్పి అంటే ఏమిటి?
నోటి వెనుక భాగంలో ఆలస్యంగా (చివరిగా) వచ్చే మొలార్ (నమిలే) దంతాలను జ్ఞాన దంతాలు అని అంటారు. అవి సాధారణంగా కౌమారదశ చివరిలో లేదా ఇరవైల ప్రారంభంలో బయటకు వస్తాయి. సాధారణంగా, నాలుగు జ్ఞాన దంతాలు, పై దవడలో రెండు మరియు కింది దవడలో రెండు ఉంటాయి, కానీ కొందరు వ్యక్తులలో కొన్ని కారణాల వలన తక్కువ, ఎక్కువ లేదా వాటిలో ఏదీ ఉండకపోవచ్చు. జ్ఞాన దంతంలో నొప్పి అనేక కారణాల వల్ల సంభవిస్తుంది, వాటిలో సంక్రమణ మరియు దంతము బయటకి వచ్చే ప్రక్రియ అతి సాధారణమైనవి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
జ్ఞాన దంతం నొప్పితో ముడి పడి ఉండే సంకేతాలు మరియు లక్షణాలు:
- వాపుకు కారణమయ్యే తిత్తీలు
- దంతం దగ్గర చిగురు (gum) యొక్క వాపు మరియు ఎరుపుదనం
- చిగుళ్ల నుండి చీము స్రవించడడం
- దంత క్షయం
- చెడు శ్వాస
- జ్వరం
- మింగడంలో కఠినత
- దవడ కింద నొప్పితో మరియు వాపుతో కూడిన శోషరస కణుపులు (lymph nodes)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
జ్ఞాన దంతం నొప్పి యొక్క ప్రధాన కారణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
- దవడ దగ్గర తగినంత స్థలం లేకపోవడం వలన దంతం బయటకు రావడానికి ఇబ్బంది కలిగి అది నొప్పి కలిగించవచ్చు.
- సరిగ్గా దంతం బయటకు రాకపోవడం వల్ల, పళ్లు తోముకుపోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది, దంతాల మధ్య ఆహారం ఉండిపోవడం వల్ల అది బాక్టీరియా పెరుగుదలకు మరియు ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది తద్వారా నొప్పి కలుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
జ్ఞాన దంతం లో తీవ్ర నొప్పి ఉంటే ఒక దంతవైద్యుణ్ణి సంప్రదించాలి. దంతవైద్యులు నొప్పి యొక్క కారణాన్ని గుర్తించడానికి పళ్ళు, నోరు మరియు చిగుళ్ళను పరిశీలిస్తారు. మోలార్ పళ్ళ యొక్క పరిస్థితి గురించి ఒక సరైన-స్పష్టమైన అవగాహన పొందడానికి సాధారణంగా ఎక్స్- రే సూచించబడుతుంది.
పంటినొప్పి యొక్క ఖచ్చితమైన చికిత్స కారణం ఆధారపడి ఉంటుంది, కానీ దంతవైద్యులు నొప్పి ఉపశమనం కోసం ఈ క్రింది సాధారణ చికిత్స ఎంపికలను సిఫారసు చేయవచ్చు:
- అంటురోగాల/ఇన్ఫెక్షన్ల చికిత్సకు యాంటీబయాటిక్స్
- ఓవర్ ది కౌంటర్ నొప్పి-ఉపశమన మందులు
- యాంటిసెప్టిక్ మౌత్ వాష్
- ఇతర చికిత్సా విధానాలు పనిచేయకపోతే మరియు నొప్పి కొనసాగితే, శాస్త్రచికిత్స ద్వారా జ్ఞాన దంతాన్ని తొలగించడం జరుగుతుంది
- తీవ్రమైన సంక్రమణ ఉన్న సందర్భాల్లో, వాపు నుండి చీము కూడా తీసివేయడం కూడా చికిత్స ప్రణాళికలో ఒక భాగం.
దంతవైద్యుణ్ణి వెంటనే సంప్రదించి, జ్ఞాన దంత నొప్పికి తక్షణ చికిత్సను పొందడం అనేది బాక్టీరియా పెరుగుదల మరియు ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నివారించడంలో సహాయపడుతుంది.