కంటి కురుపు అంటే ఏమిటి?
కంటి కురుపుని అంజననామిక (hordeolum) అని కూడా పిలుస్తారు, ఇది కనురెప్పలను ప్రభావితం చేసే సంక్రమణ/ఇన్ఫెక్షన్. ఇది కనురెప్పల యొక్క వెలుపలి లేదా లోపలి ఉపరితలంపై ఏర్పడవచ్చు మరియు కంటి రెప్పల గ్రంథిని ప్రభావితం చేస్తుంది. కంటి కురుపు కనురెప్ప పై ఒక చిన్న మొటిమలాగా లేదా పొక్కులాగా కనిపిస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- కంటి కురుపు సాధారణంగా కంటి దగ్గర ఒక మొటిమ వలె కనిపిస్తుంది.
- ఇది చిన్నగా ఎరుపు రంగులో ఉంటుంది. కురుపు చీము కలిగి ఉన్నందున, మధ్యలో పసుపు రంగులో కనిపిస్తుంది.
- కంటి కురుపు ఉండడం వల్ల కంటిలో కురుపు ఉన్న ప్రాంతంలో నొప్పి కలుగుతుంది, ఈ నొప్పి కళ్ళు మూసినప్పుడు మరియు తెరిచినప్పుడు పెరుగుతుంది.
- కనురెప్పలు వాచినట్టు కనిపిస్తాయి, మరియు ఈ వాపు నుండి కొన్ని స్రావాలు (discharge) స్రవించవచ్చు.
- కంటి కదలికలు అసౌకర్యంగా మారతాయి, తరచూ కంటి నుండి నీళ్లు కారుతాయి, మరియు నిరంతరంగా కంటిలో ఏదో నలక (బయటి పదార్థం/వస్తువు) ఉన్న భావన కలుగుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- కంటి కురుపు బ్యాక్టీరియా సంక్రమణ వలన కలుగవచ్చు.
- రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండడం మరియు పోషకాహారలోప ఆహారం వంటివి ప్రమాద కారకాలు.
- ఇది సంక్రమణం/ఇన్ఫెక్షన్ అయినందున, ప్రభావిత వ్యక్తికీ దగ్గరగా ఉండడం ద్వారా, చేతిరుమాలులు (నాప్కిన్లు) లేదా ఇతర వస్తువులు పంచుకోవడం ద్వారా వ్యాప్తి చెందవచ్చు.
- వ్యక్తిగత పరిశుభ్రత తక్కుగా ఉండడం కూడా కంటికురుపు ఏర్పడే ప్రమాదాన్ని పెంచే మరో అంశం.
- కొన్నిసార్లు, అధికంగా పొడిబారిన కళ్ళు కూడా సంక్రమణను/ఇన్ఫెక్షన్ను ప్రేరేపిస్తాయి.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
- కంటి కురుపును నిర్ధారించడం చాలా సులభం మరియు ఎటువంటి పరిశోధనాత్మక విధానాలు (investigative procedures) అవసరం లేదు.
- వైద్యులు ఒక లైట్ తో చూడటం ద్వారా కంటి కురుపును నిర్ధారిస్తారు.
- అనేక సందర్భాల్లో, కంటి కురుపు దానికదే నయం అయ్యిపోతుంది/తగ్గిపోతుంది, కానీ దానికి కొన్ని రోజుల సమయం పడుతుంది.
- అది ఎక్కువ రోజుల పాటు ఉంటే లేదా ఎక్కువగా బాధాకరంగా/నొప్పిగా ఉంటే, వైద్యులు చికిత్సకు సలహా ఇస్తారు.
- అవసరమైతే, సంక్రమణను నివారించడానికి మరియు బ్యాక్టీరియాను తొలగించడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వబడతాయి.
- చీము చేరడంతో కురుపు మీద ఎక్కువగా ఒత్తిడి ఏర్పడితే, ఒత్తిడిని తగ్గించడానికి మరియు చీమును తొలగించడానికి వైద్యులు ఒక చిన్న కాటు (incision) పెడతారు.
- మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాట్టించాలి, తువ్వాళ్లను పంచుకోవడాన్ని నివారించాలి మరియు పదేపదే కురుపును తాకకుండా ఉండటం మంచిది.