అవిసె గింజలు అంటే ఏమిటి?
నేటితరంలో ఆరోగ్య స్పృహ కల్గిన చాలామందికి అవిసె గింజల గురించి బాగా తెలుసు. మీకు గనుక మీ హితులో లేక స్నేహితులో 'అద్భుతం' అనిపించే ఈ అవిసె గింజల గురించి చెప్పి మిమ్మల్ని కూడా వీటిని వాడమని సిఫార్సు చేసుంటే, ఈ గింజల గురించి మరింతగా తెలుసుకోవాలని మీకు ఉత్సాహంగా ఉంటే మీరు సరైన వెబ్సైట్ కే వచ్చారు. అవిసె గింజలు తినడం వల్ల మీ శరీరంలో కలిగే మంచి మంచి ప్రభావాల (good effects) గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
అవిసె గింజలు ఆహార పోషకాలకు అద్భుతమైన మూలం. వీటిని పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ తినొచ్చు. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ఈ గింజలు ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకున్నాయి. గతంలో ఈ గింజల్ని ఔషధయుక్తంగా లేక పథ్యసంబంధమైన ఆహారంగానో కొందరు తీసుకునేవారు గాని అనతి కాలంలోనే అవిసె గింజలు చాలా ప్రసిద్ధి పొంది నిత్యం తినదగిన ఆహారంగా మారిపోయాయి. నేడు మార్కెట్లోని షాపుల్లో వివిధరూల్లో అంటే మిఠాయిలు, తృణధాన్యాలు, ఎనర్జీబార్ల వంటి రూపాల్లో మనకు అవిసె గింజల ఆహారాలు లభ్యమవుతున్నాయి. వాస్తవానికి, రైతులు కూడా నాణ్యమైన అవిసె విత్తనాలను పండించడానికి కృషి చేస్తున్నారు. విజ్ఞానశాస్త్రం, పరిశోధకులు కూడా కృషి చేసి మేలురకమైన (హైబ్రిడ్) అవిసె గింజల్ని అభివృద్ధి చేసి విపణిలోకి అందించడంలో విజయవంతం అయినప్పటికీ, ఈ 21 వ శతాబ్దపుకాలంలో “అద్భుతం” అన్పిస్తున్న అవిసెగింజ కొందరు అనుకున్నట్టు మానవజాతికి కొత్తదేమీ కాదు, చాలా ప్రాచీన చరిత్రే ఉంది దీనికి. అవిసె గింజల మొట్టమొదటి వాడకం గురించిన సందర్భం లేదా రికార్డు అతి ప్రాచీనమైన పాలియోలిథిక్ శకానికి చెందింది. అవిసె గింజలు మరియు పీచు/ఫైబర్ గురించిన ప్రస్తావన బైబిల్లో కూడా ఉంది. ఈజిప్ట్ దేశస్థులు శవాన్నిభద్రపరచడానికి (mummifying) అనుసరించే పద్ధతిలో పీచు పదార్థాలు, అవిసె గింజల్ని వాడేవారని ప్రతీతి. మనిషి మరణించిన తరువాత ఆ శవాన్ని పూడిక (burrial) ద్వారా భద్రపరిచేందుకు ముందు, దాన్ని “మమ్మీ” గా తీర్చడంలో అనుసరించే ప్రక్రియలో ఈ అవిసెగింజల్ని వాడేవారు, శవాన్ని పీచులో చుట్టేందుకు ఈ అవిసెగింజల్ని వాడేవారు. కాబట్టి అవిసె గింజల చరిత్ర కూడా దాదాపు మానవుడి చరిత్ర అంతటి పాతది అని చెప్పడం తప్పు కాదు.
అవిసె గింజలు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఔషధశాస్త్ర (బొటానికల్) నామం: లైనం ఉసితేఁటిస్సిమమ్ (Linum usitatissimum) (ఈ జాతి పేరుకు అర్థం "చాలా ఉపయోగకరంగా" అని.)
- కుటుంబం: లినసే
- సాధారణ పేరు: “అవిసె గింజ” లేదా హిందీలో "అల్సి కీ బీజ్", అని, ఇంకా “లిన్సీడ్”, "ఫ్లాక్స్ సీడ్”, “కామన్ ఫ్లాక్స్” అని పిలుస్తారు.
- సంస్కృతం పేరు: అటాసి
- అవిసె చెట్టులో ఉపయోగించే భాగాలు: విత్తనాలు
- అవిసె పంట యొక్క స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఆసియా, కెనడా మరియు అమెరికాలోని కొన్ని భాగాల్లో అవిసె చెట్టు పెరుగుతుంది. మన భారతదేశంలో మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అవిసెను పెద్ద ఎత్తున ప్రధానంగా పండిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఆకుతోటలు లేదా తమలపాకుల తోటల్లో తమలపాకు తీగల్ని ఈ అవిసె చెట్లపైకి మళ్లించి (అంటే అవిసె చెట్టుకు చుట్టి) పెంచుతారు.
- శక్తిశాస్త్రం: తాపనము (వార్మింగ్).