అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) అంటే ఏమిటి?
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే (Deep Vein Thrombosis లేదా DVT) వ్యాధి అంటే కాళ్లలో ఉన్న అంతర్నాళాల్లోని ఒక అంతర్నాళంలో రక్తం గడ్డ కట్టడం. రక్తనాళంలో ఇలా రక్తపు గడ్డలేర్పడడంవల్ల ప్రమాదకరమైన ఈ DVT వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి 60 సంవత్సరాలకు పైబడినవారికెవరికైనా రావచ్చు. భారతదేశంలో ఈ వ్యాధి సంభవం రేటు 8% -20% ఉంటుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి ప్రధాన లక్షణం కాలి వాపు. చాలా అరుదుగా, రెండు కాళ్ళలో వాపు కనిపిస్తుంది.
ఇతర లక్షణాలు:
- కాలిలో నొప్పి
- కాలు మీద చర్మం ఎరువు రంగుదేలుతుంది
- కాలిలో వెచ్చదనం అనుభూతి
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే గడ్డకట్టిన రక్తపుగడ్డలు (blood clots) స్థానభ్రంశం చెందుతాయి, అటుపై అవి రక్తప్రసరణతో బాటు ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరి అక్కడ అడ్డుగా తయారై “పల్మోనరీ ఎంబోలిజం” అనే ప్రమాదకరమైన ఈ పరిస్థితిని కల్గిస్తాయి.
పల్మోనరీ ఎంబోలిజమ్ యొక్క లక్షణాలు:
- ఆకస్మికంగా శ్వాసలో కష్టం ఏర్పడడం
- ఘాడ శ్వాస మరియు దగ్గుతో ముడిపడి ఉన్న ఛాతీ నొప్పి
- మైకము
- వేగంగా కొట్టుకునే నాడి (ఫాస్ట్ పల్స్)
- దగ్గినప్పుడు రక్తం పడడం
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి ప్రధాన కారణాలు ఏమిటి?
నరాల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకునేది ఏదైనా సరే DVT వ్యాధి లేదా అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- సిర (vein) కు గాయం
- శస్త్ర చికిత్స (సర్జరీ)
- క్యాన్సర్, హృదయ వ్యాధి లేదా తీవ్రమైన సంక్రమణం వంటి ప్రధాన జబ్బులు
- కొన్ని మందులు
- చాలా కాలంపాటు నిష్క్రియగా ఉండడం
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) అవకాశాల్ని పెంచే ప్రమాద కారకాలు:
- వంశపారంపర్యంగా రక్తం గడ్డకట్టడం అనే రుగ్మత
- గర్భం
- గర్భనిరోధక మాత్రల వాడకం
- ఊబకాయం
- ధూమపానం
- గుండె ఆగిపోవుట
- ప్రేగు వాపు వ్యాధి (Inflammatory bowel disease)
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధిని నిర్ధారించేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క వైద్య చరిత్ర మరియు వ్యాధి సోకిన అంగం యొక్క శారీరక పరీక్షపై ఆధారపడుతుంది. రోగి ఔషధ చరిత్రను కూడా వైద్యులు పొందుతారు. ఇతర రోగనిర్ధారణ చర్యలు:
- డి - డైమర్ పరీక్ష
- అల్ట్రాసౌండ్
- వేనోగ్రఫీ (Venography)
- సిటి (CT) లేదా ఎంఆర్ఐ (MRI) స్కాన్లు
- పల్మోనరీ ఆంజియోగ్రఫి
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) వ్యాధి యొక్క అంతర్లీన కారణాన్ని గుర్తించే పరీక్షలు:
- రక్త పరీక్ష
- ఛాతీ ఎక్స్-రే
- ECG
అంతర్నాళాల్లో రక్తం గడ్డకట్టే వ్యాధి (DVT) చికిత్స లక్ష్యాలు నొప్పి మరియు వాపు నుండి రోగికి ఉపశమనం కల్గించడం. మందుల్లో ముఖ్యంగా రక్తాన్ని పలుచబరిచే (ఎజెంట్లను) వాటికి ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి.
నివారణ చర్యలు:
- మీరు మంచం పట్టి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే, సాధ్యమైనంత త్వరగా అటూ ఇటూ తిరగండి. ఇలా ఎంత ముందుగా మంచంపై నుండి లేచి తిరుగుతారో DVT వ్యాధి వచ్చే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి.
- ఎక్కువ కాలం పాటు కూర్చొని ఉండకుండా నరాలు గట్టిపడడాన్ని నిరోధించడానికి కాలు కండరాల వ్యాయామం చేయండి.
- రక్తం గడ్డ కట్టడాన్ని (clotf ormation) నిరోధించడానికి కుదింపు మేజోళ్ళు (compression stockings) ఉపయోగించండి.
- ప్రసరణకు అడ్డంకుల్ని నివారించడానికి, శరీరం కదిలేందుకు వీలుగా ఉండేందుకు గాను వదులుగా ఉండే బట్టలు ధరించండి.
- చురుకైన జీవనశైలిని అలవర్చుకోండి.
- రక్తాన్ని పలుచబరిచే మందుల్ని మీరు సేవిస్తున్నపుడు శరీరంలో ఎక్కడైనా రక్తస్రావం జరుగుతోందా అని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి.