మల్టిపుల్ మైలోమా అంటే ఏమిటి?
మల్టిపుల్ మైలోమా (multiple myeloma) అనేది శరీరంలోని ప్లాస్మాకణాల్లో వచ్చే ఓ రకం క్యాన్సర్. ఈ ప్లాస్మా కణాలు సాధారణంగా ఎముక మజ్జలో కనిపిస్తాయి మరియు రోగనిరోధక వ్యవస్థలో ఓ భాగమై ఉంటాయి. రక్త కణాల ఉత్పత్తిని దెబ్బ తీసేవిధంగా ఎముక మజ్జలో ప్లాస్మా కణాలు వృద్ధి చెందుతాయి, ఈ పరిస్థితే మల్టిపుల్ మైలోమా లేక “బహుళ విస్తారక క్యాన్సర్” కు దారి తీస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వ్యాధి తరువాతి దశల్లో మల్టిపుల్ మైలోమా సంకేతాలు విస్తృత శ్రేణిలో సంకేతాలు మరియు లక్షణాలను ప్రదర్శించటం మొదలుపెడుతుంది. ఆ వ్యాధి సంకేతాలు లక్షణాల్లో కొన్ని:
- స్థిరమైన ఎముక నొప్పి
- ఎముకలు బలహీనపడటం, త్థఫలితంగా స్వల్పమైన ప్రభావాలకే తరచుగా ఎముకలు విరగడం ఏర్పడుతుంది.
- అనీమియా (రక్తహీనత)
- తరచుగా అంటువ్యాధులు
- కడుపు నొప్పి, తీవ్ర దాహం, మలబద్ధకం మరియు మగతకు దారితీసే రక్తంలో పెరిగే కాల్షియం స్థాయిలు
- మూత్రపిండ సమస్యలు సంభవించటం మొదలుపెడతాయి, ఇది మూత్రపిండాల లోపం లేదా మూత్రపిండ వైఫల్యానికి దారితీస్తుంది
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
మల్టిపుల్ మైలోమాకు ఖచ్చితమైన కారణాన్నివైద్యులచే ఇంకా నిర్ధారించబడలేదు. కానీ మల్టిపుల్ మైలోమా ప్రమాదాన్ని పెంచుతాయని నమ్మే కొన్ని కారణాలున్నాయి. 35 సంవత్సరాల పైబడ్డవయసు, ఊబకాయం, మల్టిపుల్ మైలోమా యొక్క కుటుంబ చరిత్ర, లింగపరంగా మగాళ్లకు మరియు ఆఫ్రికన్ అమెరికన్లయిన వాళ్లకు ఈ వ్యాధి నిర్ధారణ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఒక ముఖ్యమైన కారకం ఆన్కోజెన్లు మరియు కణితి నిరోధక జన్యువుల మధ్య అసమతుల్యత. మానవ శరీరంలోని కణాల పెరుగుదలకు ఆన్కోజీన్లు బాధ్యత వహిస్తాయి, అయితే కణితి అణిచివేత జన్యువులు వృద్ధిని మందగించడం లేదా సరైన సమయంలో కణాల మరణానికి కారణమవుతాయి. ఈ జన్యువుల ఉత్పరివర్తన మరియు వైఫల్యం ఫలితంగా ప్లాస్మా కణాల యొక్క అనియంత్రిత పెరుగుదలకు దారితీస్తుంది, ఫలితంగా మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ సంభవిస్తుంది.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
లక్షణాలు మరియు సంకేతాలు మల్టిపుల్ మైలోమాను సూచిస్తున్నట్లైన, ఒక ఎక్స్రే, పూర్తి రక్త గణన, మూత్ర విశ్లేషణ, CT స్కాన్, PET స్కాన్, లేదా MRI పరీక్షలకు వైద్యుడిచే ఆదేశించబడతాయి. ఈ స్కాన్లు కణితి యొక్క స్థానాన్ని మరియు ఏ మేరకు కణితి పెరిగిందో గుర్తించడంలో సహాయపడతాయి.
మల్టిపుల్ మైలోమాను నిర్ధారించడానికి బయాప్సీ (జీవాణుపరీక్ష) మరింత ఖచ్చితమైన పరీక్ష. ఎముక మజ్జలలో క్యాన్సస్ ప్లాస్మా కణాల యొక్క ఉనికిని కనుగొనటానికి ఎముక మజ్జల నమూనాలను తీసుకుంటారు.
కెమోథెరపీ మల్టిపుల్ మైలోమాకు చాలా సాధారణమైన చికిత్సగా ఉంది, అయినప్పటికీ అది కొన్ని దుష్ప్రభావాల (side effects) కు దారితీస్తుంది. కెమోథెరపీ మందులు క్యాన్సర్ కణాలను చంపడానికి మరియు కణితి పెరుగుదలను ఆపడానికి ఉపయోగిస్తారు.
ఇతర మందులు కూడా ఉపయోగించబడతాయి కానీ ఇవి వ్యాధి నివారణకు ఎల్లవేళలా విజయవంతంగా పనిచేయవు లేదా ఎన్నో దుష్ప్రభావాలను కలుగజేయడం ఉంటుంది. . ఈ మందులు ఇలా ఉంటాయి:
- స్టెరాయిడ్లు - స్టెరాయిడ్లను సాధారణంగా కీమోథెరపీ ఔషధాలకు పూరకంగా పని చేయడానికి మరియు అవి మరింత ప్రభావవంతంగా పని చేయడానికి ఉపయోగిస్తారు. స్టెరాయిడ్స్ యొక్క ప్రధాన దుష్ప్రభావాలు గుండెల్లో మంట, అజీర్ణం మరియు నిద్రలేమి సమస్యలు.
- థాలిడోమైడ్ - థాలిడోమైడ్ కూడా మైలోమా కణాలను చంపడంలో సహాయపడుతుంది, కాని తరచూ మలబద్ధకం మరియు తలనొప్పిని ఏర్పరుస్తుంది. అంతేకాకుండా, దీనివల్ల రక్తం గడ్డకట్టడం ఏర్పడే ప్రమాదం ఉండడంవల్ల కాళ్లలో నొప్పిని లేదా వాపును, శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీలో నొప్పి వంటి రుగ్మతల్ని కలుగజేస్తుంది.
- స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ - మైలోమా యొక్క తీవ్రమైన సందర్భాల్లో, దెబ్బతిన్న ఎముక మజ్జ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మూల కణాలతో భర్తీ చేయడానికి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ నిర్వహిస్తారు, ఇది కొత్త కణాల పెరుగుదలకు దారితీస్తుంది మరియు ఎముక మజ్జను తిరిగి పొందడానికి సహకరిస్తుంది.
ఈ చికిత్సలు ఖరీదైనవి మరియు బాధాకరమైనవి కూడా. ఈ వ్యాధి చికిత్సకు రోగి మరియు వైద్యుడు వైపు నుండి బాధ్యతాయుతమైన నిబద్ధత అవసరం.