పిండం యొక్క అన్ని విధాల అభివృద్ధి సాధారణంగా జరిగేందుకు నాల్గవ నెలలో సరైన ఆహారం తీసుకోవడం ఒక ముఖ్యమైన అంశం. గర్భధారణ సమయంలో మీ శరీరం నిరంతరం మారుతూ ఉంటుంది మరియు దానికి అనుగుణంగా మీ ఆహారం కూడా తప్పనిసరిగా మారాలి. 4 నెల కోసం కొన్ని ఆహార అవసరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
కేలరీలు తీసుకోవడాన్ని పెంచండి
గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో, మీరు మీ గర్భవతి కాక ముందు తీసుకునే కెలరీలకు సమానమైన కేలరీలను తీసుకోవాలి (ఆహార కోరికలను మినహాయించి). కానీ, నాల్గవ నెల, రెండవ త్రైమాసికంలో ప్రారంభాన్ని సూచిస్తుంది కాబట్టి, మీరు తీసుకునే కేలరీలను పెంచడం కూడా చాలా ముఖ్యం.
నాల్గవ నెలలో కనీసం 2200 కేలరీలు తీసుకోవాలని మీరు సిఫార్సు చేయబడింది మరియు మీ శరీర అవసరాలను బట్టి ఇంకా ఎక్కువ కూడా అవసరం కావచ్చు.
దీని కోసం, సమతుల్య ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన వనరుల నుండి అధిక కేలరీలను తీసుకోవడం మరియు తర్వాత విభాగాలలో చర్చించిన ఆహారాలని ప్రత్యేకంగా చేర్చడం చేయడం మంచిది.
ఫైబర్ తీసుకోవడం పెంచండి
నాల్గవ నెలలో మలబద్ధకం ఒక పెద్ద సమస్య కాబట్టి, కరిగే (soluble) మరియు కరగని (insoluble) రెండు రకాల డైటరీ ఫైబర్లను ఆహారంలో ఎక్కువగా చేర్చడం చాలా ముఖ్యం. జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని నివారించడంలో ఫైబర్ల యొక్క సామర్ధ్యత రుజువు చేయబడింది. అలాగే, అవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది ఏమి తోచక ఏదోకటి తినాలనే ఆహార కోరికలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో ఎక్కువ ఫైబర్స్ చేర్చడానికి, సాధ్యమైనప్పుడల్లా ఎక్కువ తృణధాన్యాలు, తాజా పండ్లు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి.
ఎక్కువ నీరు తీసుకోండి
ఇది ఫైబర్స్ యొక్క సమీకరణకు సహాయపడుతుంది మరియు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు కనీసం 2-3 లీటర్ల నీరు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. మీ బరువు మరియు శారీరక శ్రమ స్థాయిని బట్టి మీకు మరింత ఎక్కువ నీరు అవసరం కావచ్చు.
మీ ఆహారంలో ఎక్కువ ఐరన్ ను చేర్చండి
ఐరన్ లోప రక్తహీనతను నివారించడానికి గర్భధారణ సమయంలో ఐరన్ తీసుకోవడం చాలా అవసరం. రక్తం ఏర్పడటానికి ఐరన్ ముఖ్యమైనది, పిండానికి పోషణను అందించడానికి మరియు అసాధారణతలను నివారించడానికి ఇది అవసరం. అలాగే, ఐరన్ లోపం ముందస్తు ప్రసవం, తక్కువ జనన బరువు మరియు ఇతర క్రమరాహిత్యాలతో ముడి పడి ఉంటుంది.
పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి గర్భధారణ సమయంలో 30 నుండి 60 మి.గ్రా ఐరన్ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచిస్తుంది.
ఆకుకూరలు, గింజలు (నట్స్), కాయధాన్యాలు, తృణధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటి ఆహార వనరులను మీ ఆహారంలో చేర్చడం ద్వారా దీనిని సాధించవచ్చు.
ఈ సహజ మొక్కల వనరుల ద్వారా ఐరన్ వినియోగాన్ని పెంచేటప్పుడు, దాని శోషణను సులభతరం చేయడానికి విటమిన్ సి ని కూడా ఆహారంలో చేర్చాలి.
ప్రోటీన్లను తీసుకోండి
ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్లు, ఇది గర్భధారణ సమయంలో ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం.
గర్భధారణ సమయంలో పాలు మరియు ప్రోటీన్లను ఆహారంలో చేర్చడం అనేది పిండం పెరుగుదలను ప్రోత్సహిస్తుందని మరియు వాటి లోపం పెరుగుదల ఆగిపోవడానికి కారణమవుతుందని పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి. నాల్గవ నెలలో శిశువు వేగంగా పెరుగుతుంది కాబట్టి, మీరు తగినంత ప్రోటీన్లను తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే, మీ ఆహారంలో ప్రోటీన్లను తగినంతగా మాత్రమే చేర్చాలని మరియు ప్రతి రోజు 65 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేయబడింది. గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ వినియోగం కూడా పిండం పెరుగుదలను ఆలస్యం చేస్తుంది.
ఫోలిక్ యాసిడ్
ఫోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ్ ఏర్పడటంలో పాల్గొంటుంది మరియు ఈ విటమిన్ లోపం న్యూరల్ ట్యూబ్ అసాధారణతలకు కారణమవుతుంది. అయితే, అభివృద్ధి ఇప్పటికే పూర్తయినందున సాధారణంగా గర్భధారణ యొక్క నాల్గవ నెలలో ఇది అవసరం ఉండదు.
కాల్షియం
పిండం ఎముకల పెరుగుదలను సులభతరం చేయడానికి మీ ఆహారంలో కాల్షియం చేర్చడం చాలా అవసరం, అయితే అదనపు సుప్ప్లీమెంటేషన్ అవసరం లేదు.
నివారించాల్సిన ఆహారాలు
పచ్చి లేదా సరిగ్గా వండని గుడ్లు మరియు పప్పరోని, సలామి, హాట్‌డాగ్స్ వంటి పచ్చి లేదా కోల్డ్ ప్రాసెస్ చేసిన మాంసాలు ఎందుకంటే ఇవి పరాన్నజీవులను వ్యాప్తి చేసి అంటువ్యాధులకు కారణమవుతాయి. అలాగే సీఫుడ్, సుషీ, ట్యూనా, చీజ్, పచ్చి పాలు, కాలేయం, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను కూడా నివారించాలి. ఇది కాకుండా, అదనపు కెఫిన్ తీసుకోవడం తక్కువ జనన బరువుతో ముడిపడి ఉన్నందున అదనపు కెఫిన్ లేదా గ్రీన్ / హెర్బల్ టీ వినియోగాన్ని నియంత్రణలో ఉంచాలి. కాబట్టి, రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ టీ లేదా కాఫీ త్రాగకూడదు.